Govt Assistance To Metro: కొవిడ్ -19 తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోకు శాపంగా మారింది. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రోరైల్ ప్రజల ఆదరణను చూరగొంది. వివిధ సందర్భాల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఎంతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రోరైలు పేరుపొందింది. ఐతే కరోనా మహమ్మారి మెట్రోను దారుణంగా దెబ్బతీసింది.
covid effect on metro: లాక్‌డౌన్, వివిధ రంగాల కార్యకలాపాలు మందగించడం, వర్క్ ఫ్రంహోం వంటి కారణాలతో ప్రయాణికుల సంఖ్యగణనీయంగా పడిపోయింది. కోవిడ్ ప్రభావం పూర్తిగా తొలగకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్య ఆశించిన మేరపెరగలేదు. లాక్‌డౌన్, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోకు క్రమంగా నష్టాలు పెరిగాయి. తమకు ఆర్థికంగా చేయూత అందించాలంటూ పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్‌ఆండ్‌టీ సంస్థ కోరింది.
cm kcr on metro: ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రిని కలిసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఆర్థికనష్టాలు, అప్పుల భారం, వడ్డీ చెల్లింపులను వివరించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ అన్ని రంగాలను ఆదుకున్నట్లుగానే మెట్రోను గాడిలోపెట్టేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తామని హామీఇచ్చారు. నష్టాలనుంచి గట్టెక్కించి పూర్వవైభవం తెచ్చేందుకు అననుసరించే విధానంపై అధ్యయనం కోసం ఓ కమిటీ ఏర్పాటుచేశారు. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో గతంలో సమావేశమైన కమిటీ మెట్రో నష్టాలు, ఎల్ అండ్ టీ చేసిన విజ్ఞప్తులపై సుదీర్ఘంగా చర్చించింది.
L and T metro: ప్రభుత్వం అండగా నిలవకపోతే హైదరాబాద్ మెట్రో నుంచి తప్పుకునేందుకు సిద్ధమంటూ ఎల్ అండ్ టీ సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెట్రోరైల్‌పై చర్చ జరగ్గా సాధ్యమైనంతమేర ప్రభుత్వపరంగా సాయం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మెట్రోనిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకునే పరిస్థితి రాకుండా చూడాలని ఏ ఆటంకం లేకుండా కార్యకలాపాలు జరిగేలా చూడాలని మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
త్వరగా సూచనలు ఇవ్వండి: సీఎస్
CS on metro: తక్షణ, దీర్ఘకాలిక చర్యలు ఏం చేపట్టాలనే అంశంపై కసరత్తు చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వం దృష్టికి తేవాలని సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో చర్చించి తగిన సూచనలివ్వాలని స్పష్టంచేశారు. కరోనా వల్ల సర్కారుకు ఆదాయం తగ్గినందున ఏ మేరకు ఆర్ధిక సాయం చేయగలమనే అంశంపై ఆలోచన చేస్తోంది. ఒకేసారి కాకుండా దశలవారీగా వెయ్యికోట్ల వరకు సాఫ్ట్ లోన్ ఇచ్చే అవకాశంఉందని లీజు, మార్ట్‌గేజ్ లాంటి నిబంధనలమార్పుపై అన్నిరకాలుగా ఆలోచించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వడ్డీరేట్లు తగ్గించుకునేందుకు రుణాల మార్పుతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు. కేవలం ప్రస్తుతం నష్టాల నుంచి గట్టేందుకు వీలుగా తాత్కాలిక చర్యలు చేపట్టడమే కాకుండా దీర్ఘకాలికంగా హైదరాబాద్ మెట్రో రైల్‌ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ అండ్ టీ అధికారులతో చర్చించిన తర్వాత న్యాయపరంగా అన్నిఅంశాలను పరిశీలించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైల్ సదుపాయం కలిగేలా రెండోదశ పనులకు సిద్ధం కావాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: