నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్- సెప్టెంబర్) ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షం కురుస్తుందని భూ విజ్ఞాన శాస్త్ర కార్యదర్శి ఎం.రాజీవన్, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఎ.మహాపాత్ర ప్రకటించారు. ఈ ఏడాది రుతుపవనాలపై తొలి ముందస్తు అంచనాలను వారు బుధవారం విడుదల చేశారు. దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 100% (5% అటూఇటూగా) వర్షపాతం ఈసారి నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు మూడు నుంచి ఏడు రోజుల ఆలస్యంతో నైరుతి వస్తుందని చెప్పారు.
ప్రధాన నగరాలకు నిరీక్షణే
కేరళ తీరానికి రుతుపవనాలు జూన్ 1 నాటికి వస్తాయని రాజీవన్ వెల్లడించారు. కొన్ని ప్రాంతాలకు రుతుపవనాల ఆగమనం సాధారణం కంటే 3 నుంచి 7 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం జులై 15కి బదులు జులై 8కే చేరుకోనున్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ఉపసంహరణ వాయువ్య భారతంలో సాధారణం కంటే 7-14 రోజులు ఆలస్యమవుతుందన్నారు. నైరుతి రుతుపవనాల చివరి దశ ఉపసంహరణ మాత్రం ఎప్పటిలా అక్టోబర్ 15న జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్నాల్లో రుతుపవనాల ఉపసంహరణ ఒకరోజు ముందే జరుగుతుందన్నారు. లానినా వస్తే మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇప్పటివరకూ రుతుపవనాల రాక, ఉపసంహరణకు 1901-1940 మధ్య ఉన్న సమాచారంపై ఆధారపడేవాళ్లమని చెప్పారు. ఈసారి మాత్రం రుతుపవనాల రాకకు 1961-2019 మధ్య వివరాలను, ఉపసంహరణకు 1971-2019 మధ్య గణాంకాలను ఆధారంగా చేసుకున్నామని వివరించారు.
ఇదీ చదవండి: