తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 17 కేసులు నమోదు కావటం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 404కి చేరింది. ఇందులో 45 మంది ఇప్పటికే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా... 11మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 348 ఉన్నాయి. వీరిలో 150 మంది ఒక్క హైదరాబాద్‌కి చెందిన వారే కావటం గమనార్హం.
వారం రోజుల్లో గణనీయంగా...
వారం రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు గరిష్ఠంగా నమోదవుతుండగా.. వీరిలో అత్యధికులు దిల్లీ మర్కజ్ యాత్రతో సంబంధం ఉన్నవారే కావటం గమనార్హం. మర్కజ్ నుంచి వచ్చిన వారిపై దృష్టి సారించిన సర్కారు.. ఇప్పటికే మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారితో కలిసి ఉన్నవారందరికీ.. కరోనా పరీక్షలను నిర్వహించారు. ఫలితంగా వారం రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
22 ప్రైవేటు మెడికల్ కళాశాలు..
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. రోజు దాదాపు రెండు గంటల పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తెలంగాణ సీఎస్ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ... ఆయా జిల్లాల్లోని పరిస్థితులను తెలుసుకుంటున్నారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డులను మంగళవారం తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ కలిసి సందర్శించారు. రాష్ట్రంలో ఉన్న 22 ప్రైవేటు మెడికల్ కళాశాలలను పూర్తి స్థాయిలో కరోనా రోగుల కోసం కేటాయిస్తున్నట్లు తెలంగాణ మంత్రి ఈటల ప్రకటించారు. ఫలితంగా మరిన్న కరోనా ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాల్సిన చికిత్స అందించవచ్చని వైద్యఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.
అప్రమత్తం..
తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు లాక్‌డౌన్‌ని పూర్తిస్థాయిలో పాటించి... అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారు తక్షణం దగ్గరలోని ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరింది.
ఇదీ చూడండి: కొవిడ్ సంక్షోభంలో ప్రధానికి సోనియా 5 సూచనలు