రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం కనిపిస్తోంది. సోమవారం 9 మండలాల్లో వీటి తీవ్రత కన్పించింది. 386 మండలాల్లో ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఎండలు, ఉష్ణతాపం ఎక్కువగా ఉంది.
* సోమవారం కర్నూలు జిల్లా గోస్పాడులో 43.9 డిగ్రీలు, కడప జిల్లా వేంపల్లె మండలం, కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాలో 43.7 డిగ్రీలు, కొండాపురంలో గరిష్ఠంగా 43.4, కమలాపురంలో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* రాబోయే రెండు రోజులూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. విశాఖపట్నం జిల్లాలో కొన్నిచోట్ల 40 డిగ్రీల పైన, కృష్ణా జిల్లాలో కొన్నిచోట్ల 43 డిగ్రీల పైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది.
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే అయిదు రోజులు ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. దక్షిణ కోస్తాలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. రాయలసీమలో మంగళవారం పొడి వాతావరణం, బుధవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వివరించారు.
జిల్లాల వారీగా ఎన్ని మండలాల్లో...
వడగాల్పులు: కడప 6, కర్నూలు 2, కృష్ణా 1
వేడి వాతావరణం: కర్నూలు 53, కడప 51, అనంతపురం 45, చిత్తూరు 44, ప్రకాశం 44, గుంటూరు 40, నెల్లూరు, 35, కృష్ణా 31, పశ్చిమ గోదావరి 25, తూర్పు గోదావరి 17, శ్రీకాకుళం 1
ఇవీ చదవండి...విద్యుత్తు బిల్లుల షాక్!