High Court on Gudivada compost yard : కృష్ణా జిల్లా గుడివాడలో సర్వేనంబరు 251లో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటుపై యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్, గుడివాడ మున్సిపల్ కమిషనర్, తదితరులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జవనరి 24కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
గుడివాడ ఎన్జీవో కాలనీలో భాగమైన స్థలాన్ని సామాజిక అవసరాల కోసం ఖాళీగా ఉంచారని అందులో కంపోస్ట్ యార్డు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారని, ఆ ప్రక్రియను నిలువరించాలని కోరుతూ విశ్రాంత ఉద్యోగి గోపాలకృష్ణయ్య హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది తోట సునీత వాదనలు వినిపిస్తూ.. ప్రజల నివాస ప్రాంతంలో చెత్త డంప్ చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారన్నారు. సర్వేనంబర్ల వివరాలను కోర్టు ముందు ఉంచారు. గుడివాడ మున్సిపాలిటీ తరఫు న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతానికి కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం .. స్టేటస్ కో పాటించాలని అధికారులను ఆదేశించింది.
ఇదీ చదవండి