మీడియా స్వేచ్ఛను ఉక్కుపాదంతో అణచివేసేందుకు 2430 వంటి జీవోలు తెచ్చిన జగన్ సర్కారు... ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా ఒక పాఠశాలలో ఫొటోలు తీసిన ముగ్గురు ఫొటో జర్నలిస్టులపై కేసులు పెట్టించింది. రైతుల ఉద్యమాన్ని కవర్ చేస్తున్నారన్న అక్కసుతో... ఉద్దేశపూర్వకంగానే ఒక మహిళా కానిస్టేబుల్‌తో ఫిర్యాదు చేయించి పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేయించింది. ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టంతో పాటు నిర్భయ చట్టం కూడా ప్రయోగించింది.
రైతు ఉద్యమాన్ని తెలియజేస్తున్నారనే...
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయానికి నిరసనగా రాజధాని గ్రామాల ప్రజలు 37 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరునూ ప్రజలకు చేరవేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అవకాశం దొరికితే మీడియాపై కత్తులు నూరేందుకు సిద్ధంగా ఉంది. బుధవారం విధి నిర్వహణలో భాగంగా రాజధాని గ్రామాల ప్రజల ఆందోళనలను కవర్ చేస్తున్న కొందరు ఫొటో జర్నలిస్టులకు ఒక సమాచారం అందింది. మందడంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదుల్ని బందోబస్తులో ఉన్న పోలీసుల బస కోసం కేటాయించి, పిల్లల్ని ఆరుబయట కూర్చోబెట్టి చదువు చెబుతున్నందుకు... పాఠశాల సిబ్బంది, పోలీసులతో గ్రామస్థులు, తల్లిదండ్రులు గొడవ పడుతున్నారన్నది దాని సారాంశం. ఆ సంఘటనను కవర్ చేసేందుకు పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అక్కడికి చేరుకున్నారు. వారిలో ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్ మరిడయ్య కూడా ఉన్నారు. అక్కడి దృశ్యాలు చూస్తే ప్రజల ఆరోపణ నిజమేనని, పిల్లల్ని ఆరుబయట కూర్చోబెట్టి చదువు చెబుతున్నారని తేలింది. ఒక గదిలో పిల్లలు కూర్చునే బల్లలు, కుర్చీలపైనా, పాఠశాల మైదానంలోని వాలీబాల్ కోర్టులో నెట్‌నీ ఒక దండెంలా మార్చేసి దానిపైనా దుస్తులు ఆరేసిన దృశ్యాలు కనిపించాయి. పాఠశాల విద్యార్థులే ఫొటోగ్రాఫర్లను వెంట తీసుకెళ్లి తాము కూర్చునే బల్లలపై దుస్తులు ఆరబెట్టిన దృశ్యాల్ని చూపించారు.
పథకం ప్రకారం...
ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకుని బయటకు వస్తుండగా.. ఒక మహిళా పోలీసు అధికారి అడ్డుకున్నారు. 'మా అనుమతి లేకుండా ఫొటోలు ఎందుకు తీస్తున్నారు? మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు?' అని గద్దించారు. ఫొటోగ్రాఫర్లను పోలీసులు సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉక్రోషం పట్టలేని పోలీసు ఉన్నతాధికారులు కుట్రపూరితంగా ఒక మహిళా కానిస్టేబుల్‌తో ముగ్గురు మీడియా ప్రతినిధులపై కేసు పెట్టించారు. ఉదయం 10-12 గంటల మధ్య ఈ సంఘటన జరగగా పథకం ప్రకారం రాత్రి 10.30కి తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు
మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా మీడియా ప్రతినిధులు వీడియో తీశారన్నది ఉన్నతాధికారులు కావాలని చేయించిన ఫిర్యాదే. తరగతి గదుల్ని పోలీసుల కోసం కేటాయించి, పిల్లలకు ఆరుబయట ఎలా చదువు చెబుతారని మందడం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిని స్థానికులు నిలదీసిన మాట వాస్తవం. ఆ విషయం తెలిసే మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయటంతో అక్కడ కొంత గందరగోళవాతావరణం నెలకొంది. ఆ విషయం తెలిసే తుళ్లూరు, నరసరావుపేట డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి అక్కడికి వచ్చారు. వారిద్దరూ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. రాజధాని రైతుల్ని కొన్ని ఛానళ్లు రెచ్చగొడుతున్నాయంటూ దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నమూ చేశారు. ఛానళ్లకు నోటీసులు ఇస్తామనీ హెచ్చరించారు. మీడియా ప్రతినిధుల్ని ఎందుకు పిలిచారని స్థానికులపైనా మండిపడ్డారు.
ఈ వివాదం సద్దుమణిగాక... తమ తరగతి గదిలో పోలీసులు దుస్తులు ఆరేశారని, తమకు కూర్చోవడానికి లేదని విద్యార్థులే కొందరు ఫొటో జర్నలిస్టులను వెంట తీసుకెళ్లారు. వారు ఎవరిపట్లా అసభ్యంగా ప్రవర్తించ లేదు. మహిళల్ని ఫొటోలు తీయలేదు. ప్రభుత్వ కనుసన్నల్లో రాజధాని గ్రామాల్లో రైతులపై తాము చేస్తున్న దాష్టీకాన్ని బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారని కొన్నాళ్లుగా మీడియా ప్రతినిధులపై కక్షగట్టిన పోలీసులు ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు.
నిర్భయ కేసులు
మీడియా ప్రతినిధులు మరిడయ్య, రమేష్ చౌదరి, కృష్ణలపై నల్లపోగు జ్యోతి అనే శిక్షణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌తో కేసు పెట్టించారు. మీడియా ప్రతినిధులు నేరపూరితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని గదుల్లోకి చొరబడ్డారని జ్యోతి ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరోగ్యం బాగాలేక ఉన్నతాధికారి అనుమతి తీసుకుని, బస ఏర్పాటు చేసిన హైస్కూల్‌లోని గదికి వెళ్లినట్టు జ్యోతి ఫిర్యాదులో తెలిపారు. తాను దుస్తులు మార్చుకుంటుండగా కిటికీలోంచి కెమెరాలు కనిపించడంతో కేకలు వేసి, కింద కూర్చుండిపోయానని తెలిపారు. తన అరుపులు విని అక్కడి నుంచి పరారైనవారు కాసేపటికి మళ్లీ వచ్చి క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారని... కాసేపటికి మిగతా ఛానల్స్ వారందర్నీ రెచ్చగొట్టి తీసుకువచ్చి తమను అసభ్యంగా వీడియో తీయించారని జ్యోతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 448, 354(సి), 509 రెడ్‌విత్ 34, 3(2)(వీఏ) ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టంతోపాటు నిర్భయ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయించారు.
కేసులు ఉపసంహరించుకోవాలి
తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో మీడియా ప్రతినిధులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు జర్నలిస్టుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. మందడం గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు మీడియా ప్రతినిధులు పాఠశాలకు వెళ్లారని డీజీపీకి వారు వివరించారు. విధుల నిర్వహణలో భాగంగా వెళ్లిన వారిపై దురుద్దేశాలను ఆపాదిస్తూ అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని కోరారు.
ఇవీ చదవండి..మండలిని రాష్ట్రం ఏకపక్షంగా రద్దు చేయగలుగుతుందా?