పోలవరం ప్రాజెక్టులో కుడివైపు నీళ్లను మళ్లించేందుకు వీలుగా నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల సామర్థ్యం పెంచే దిశగా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే 64, 65 ప్యాకేజీలుగా టన్నెల్ తవ్వకం పనులు నిర్దేశిత కొలతల ప్రకారం పూర్తయ్యాయి. లైనింగ్ చేయాల్సి ఉంది. గోదావరి నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు మళ్లించేలా ఈ టన్నెళ్లను డిజైన్ చేశారు. అయితే 50 వేల క్యూసెక్కుల వరకు మళ్లించేందుకు అనువుగా సామర్థ్యం పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వద్ద బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. టన్నెళ్ల సామర్థ్యం పెంపునకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
గోదావరి- బనకచర్ల అనుసంధానంలో భాగంగానే: గోదావరి- బనకచర్ల అనుసంధానంలో భాగంగానే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గోదావరి వరద జలాలను కృష్ణా మీదుగా బనకచర్ల రెగ్యులేటర్‌కు మళ్లించే ప్రతిపాదనపై వ్యాప్కోస్ అధ్యయనం చేస్తోంది. పోలవరం కుడికాలువ మార్గంలోనే నీటిని మళ్లిస్తే అంచనా వ్యయం తక్కువవుతుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ కాలువకు అటూ ఇటూ ఇప్పటికే సేకరించిన భూమి ఉన్నందున భూసేకరణ ఖర్చు కూడా తగ్గుతుందని అంచనా వేశారు. పోలవరం కుడి కాలువ మార్గంలోనే నీరు మళ్లిస్తే ఎత్తిపోతల వ్యయమూ కలిసి వస్తుందనే కోణమూ వుంది. అందుకే టన్నెళ్ల సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
వ్యాసార్థం పెంచాలి: ప్రస్తుతం 2 టన్నెళ్లు 11.8 మీటర్ల డయా (వ్యాసార్థం)తో సిద్ధం చేశారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం 2 టన్నెళ్లు 17 మీటర్ల వ్యాసార్థంతో తవ్వేలా మార్పు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఆ కారణంతోనే టన్నెళ్ల లైనింగ్ పనులు పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. కొత్త కొలతల ప్రకారం టన్నెళ్లను సిద్ధం చేయాలంటే రూ.659 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు.