ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మాధ్యమం అమలుకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ)ని సలహా కోరుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు-81, 85ను హైకోర్టు రద్దు చేస్తూ విద్యా హక్కు చట్టం-2011 ప్రకారం ఎస్‌సీఈఆర్టీ అకడమిక్ అథారిటీ అని, ఆంగ్ల మాధ్యమం నిర్ణయంలో మండలి పాల్గొనలేదని పేర్కొంది.
ఈ విధాన నిర్ణయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రుల ఐచ్ఛికాలను ప్రభుత్వం లిఖిత పూర్వకంగా సేకరించగా.. తాజాగా ఎస్‌సీఈఆర్టీ సలహాను కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ), ఏపీ విద్యా చట్టం సంబంధిత నిబంధనలను పరిశీలించి పాఠ్యప్రణాళిక, మాధ్యమంపై సిఫార్సును అందించాలని కోరింది. ఎస్‌సీఈఆర్టీ నివేదిక ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుకల్పిస్తుందని పేర్కొంది.
ఇవీ చదవండి...జూన్ 11 వరకు వేసవి సెలవులు