Primitive Man Landmarks: పైనుంచి జాలువారే జలపాతం... కింద ఆదిమ మానవుని గుహ.. వన్యమృగాల నుంచి తప్పించుకునేందుకు ఎత్తయిన రాతి చరియల్లో నివాసం.. రాక్షసగూళ్లుగా పిలుచుకునే ఆదిమ మానవుల సమాధులు.. పదునైన రాళ్లు.. రాతిగొడ్డళ్లు, ఇలా ఒక్కోచోట.. ఒక్కో చరిత్ర.. పాత.. కొత్త.. మధ్య రాతియుగాల ఆనవాళ్లకు నిలయం కృష్ణా నదీతీరం.. నాగార్జునసాగర్ ఎడమగట్టు పరిసరాలు పావురాలగుట్ట, దేవరసెల, చాకలిగట్టు తదితర ప్రాంతాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్’ అధ్యయనంలో ఆదిమ మానవుడి అడుగులు వెలుగుచూశాయి. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లో రాతియుగాల నాటి ఆసక్తికర అంశాలు, చారిత్రక ఆనవాళ్లు ఆసక్తి గొలుపుతున్నాయి.
చెక్కుచెదరని చరిత్ర
* పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి పక్కన పావురాలగుట్ట దగ్గర కొత్తరాతియుగం ఆనవాళ్లు నేటికీ చెక్కుచెదరలేదు. పనిముట్ల తయారీకి వాడిన క్వార్ట్జ్ రాతి బండలపై అరగదీసిన రాతి గుంటలు అబ్బురపరుస్తాయి. ఆవాసాలు, రాతిగొడ్డళ్లు కనిపిస్తాయి.
* ఇదే మండలం పెద్దగట్టు దగ్గర దేవరసెల ప్రకృతి సౌందర్యానికే కాదు, ఆదిమ మానవుల చరిత్రకు నెలవు. ఇక్కడ పాతరాతియుగం గొడ్డళ్లు, మధ్యరాతియుగపు సన్నటి బ్లేడ్‌లు, కొత్తరాతియుగం గొడ్డళ్లు కనిపించాయి. పొలాల నిండా ఉన్న చిట్టెపురాళ్లతో పనిముట్లు, పరికరాల్ని తయారుచేసుకునే వారని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రాతియుగపు ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.. పైన జలపాతం. కింద ఆదిమ మానవుని గుహ.. దేవరసెల లోయ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. కొండ చరియలపై రాళ్లతో చెక్కిన గుర్తులు, పైన దొరికిన రాతి పనిముట్లు కనిపిస్తాయి. చిన్న నీటిధార వాగుగా మారి కృష్ణా నదిని చేరే తీరు అద్భుతంగా ఉంటుంది. పెద్దగట్టు నుంచి ఉన్న బండ్ల బాటను బాగుచేసి బీటీరోడ్డు వేస్తే దేవరసెల ఆహ్లాదకర, పర్యాటక ప్రాంతం అవుతుంది.
* రాతిగొడ్డళ్లను పదును తేలేలా మొనల్ని అరగదీయగా ఏర్పడిన కొత్తరాతియుగపు గుంటలతో కూడిన బండరాళ్లు నాగార్జునసాగర్ బుద్ధవనం దర్శనమిచ్చాయి.
* చందంపేట మండలం కాచరాజుపల్లి శివారులో ఆదిమ మానవుల గుహలున్నాయి.
చర్రితను సంరక్షించాలి
- ఈమని శివనాగిరెడ్డి, చరిత్ర పరిశోధకుడు ప్లీచ్‌ఇండియా ఫౌండేషన్ సీఈఓ
పావురాలగుట్టపై క్వార్ట్జ్ రాతి బండలను కాపాడాలి. ఇక్కడ క్వార్ట్జ్ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం కాకమునుపే ఈ ఆనవాళ్లను శాస్త్రీయ పద్ధతుల్లో నమోదుచేసి భద్రపరచాలి. దట్టమైన అటవీప్రాంతం.. ఆకలి తీర్చుకునేందుకు జంతు సంచారం ఉండటం.. వేటకు అవసరమైన పనిముట్లు తయారీకి అవసరమైన రాతి సంపద, తాగేందుకు కృష్ణా నది నీళ్లతో ప్రస్తుత నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌గా ఉన్న ప్రాంతం ఆనాడు ఆదిమ మానవులకు అనువుగా ఉండేది. ప్రకృతి బీభత్సాలు, క్రూరజంతువుల బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు తొలుత కొండ గుహల్లో, అనంతరం కొండ చరియల కింద.. తర్వాత మైదాన ప్రాంతాల్లో ఆదిమ మానవుడు స్థిరపడ్డాడు. 1954-60 వరకు కేంద్ర పురావస్తుశాఖ జరిపిన నాగార్జునకొండ వద్ద జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వత-విజయపురి కోట గోడలతో నగరం.. బౌద్ధవేదిక కట్టడాలు, శిల్పాలు, శాసనాలు.. వీటితోపాటు ఆదిమ మానవుని రాతి గొడ్డళ్లు.. ఇనుప పనిముట్లు బయల్పడి తెలుగువారి చరిత్రను వెలుగులోకి తెచ్చాయి.
ఇది చందంపేట మండలం దేవరచర్లలోని ముని శివాలయం. గుడిలోని శివలింగంపై, ఆలయంపై కొండ నుంచి జాలువారే నీటి జల్లులు ప్రత్యేక ఆకర్షణ. అవి ఎక్కడినుంచి వస్తాయన్నది ఆసక్తికరం. వీటిని వీక్షించేందుకు పెద్దసంఖ్యలో ఆధ్యాత్మిక పర్యాటకులు వస్తుంటారు.
ఇవీ చూడండి: Rishikonda issue: రుషికొండపై తవ్వకాల తీరుపై ఎన్‌జీటీ కమిటీ..!