రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆంధ్రప్రదేశ్ భూయాజమాన్య చట్టం (ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)లోని పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. కొత్త చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే జరిపి యజమానుల పేర్లను ప్రకటిస్తారు. దీనిపై అభ్యంతరాలుంటే రెండేళ్లలోగా రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలి. ఈ గడువు దాటితే అభ్యంతరాల వ్యక్తీకరణకు అవకాశం ఉండదు. భూమిపై హక్కులున్న వ్యక్తులు మరణిస్తే వారసుల పేర్లను టైటిల్ రిజిస్టర్లలో తగిన ఆధారాలతో నమోదు చేస్తారు. టైటిల్ రిజిస్టర్లో పేరుంటే అతనే యజమాని అవుతాడు. ఇందులో ఏదైనా పొరపాట్లు చోటు చేసుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. అంటే.. యాజమాన్య హక్కులకు పూర్తి భద్రత లభిస్తుంది.
ముసాయిదాను గత ఏడాది జులైలో కేంద్రం ఆమోదం కోసం పంపించారు. ఈ కొత్త చట్టంలో వివాదాల పరిష్కారంలో సివిల్ కోర్టు ప్రమేయాన్ని తగ్గించారు. అయితే అప్పిలేట్ అథారిటీ నిర్ణయంపై జిల్లా సివిల్ కోర్టుకు వెళ్లాలని మరోచోట సూచించారు. ఈ సందిగ్ధతపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. అధికారులకు అపరిమిత అధికారాలు ఇవ్వడాన్నీ ప్రశ్నించినట్లు తెలిసింది. వాటిని సవరించి, రానున్న శాసనసభ సమావేశాల్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత మరోసారి కేంద్రానికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.