దేశంలో డ్యాంల పునరుద్ధరణకు సంబంధించిన డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) 2, 3 దశలకు ప్రధానమంత్రి నేతృత్వంలో గురువారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. 2021 - 31 మధ్య చేపట్టే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,211 కోట్లు. ఇందులో రూ.7వేల కోట్లను ప్రపంచబ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సమకూరుస్తాయి. ప్రాజెక్టును అమలుచేసే సంస్థలు రూ.3,211 కోట్లు భరిస్తాయి.
ఈ ప్రాజెక్టు కింద దేశంలోని 736 డ్యాంలను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 31, తెలంగాణ నుంచి 29 డ్యాంలున్నాయి. దీనికింద డ్యాంల సామర్థ్యాన్ని పెంచుతారని, డ్యాంల పునరుద్ధరణతో పాటు, దానితో ముడిపడి ఉన్న వనరులనూ మెరుగుపరుస్తారని.. నిర్వహణ పనులు సైతం చేపడతారని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ‘‘అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో అతి పెద్ద డ్యాంలున్న మూడో దేశం భారత్. ప్రస్తుతం దేశంలో 5,334 పెద్ద డ్యాంలున్నాయి. 411 నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం డ్యాంల్లో 80%కి పైగా 25 ఏళ్లు దాటినవే ఉన్నాయి. వాటిలో వందేళ్ల పైబడినవీ ఉన్నాయి. వీటన్నింటికీ నిర్వహణ పనులు చేపట్టాలి. ఏ డ్యాంలను ముందుగా పునరుద్ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలదే. ఏ రాష్ట్రం ఎంత వేగంగా పనిచేస్తే వారికి అంతమేరకు నిధులిస్తాం’’ అని షెకావత్ చెప్పారు.
* చక్కెర, చెరకు రసం, చక్కెర ద్రావణంతో తయారుచేసే ఇథనాల్ లీటర్ ధరను రూ.59.48 నుంచి రూ.62.65కి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.
ఇదీ చదవండి: