అమరావతినే రాజధాని(Amravati)గా కొనసాగించాలంటూ రైతులు 684 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ 29 గ్రామాలకే పరిమితమై సాగుతున్న ఈ పోరాటం... పాదయాత్ర(padayatara) ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 20 రకాల కమిటీలను, వాటికి బాధ్యులను నియమించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తున్నందున యాత్రలో స్వామివారి విగ్రహం ఉంచిన వాహనం ముందువరుసలో..ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్దతు తెలిపేవారు ఇలా వరుస క్రమంలో సాగుతారు.యాత్రలో పాల్గొనేవారి జాబితా సిద్ధమైంది.
అమరావతి ఉద్యమానికి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నందున తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించాం. అందుకు ముందుగానే మహా పాదయాత్ర పేరుతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అమరావతికి జరుగుతున్న ఆన్యాయాన్ని ప్రతి గ్రామానికి తెలిసేలా పాదయాత్ర చేస్తున్నాం. -రాయపాటి శైలజ, మహిళా ఐకాస కన్వీనర్
రాజ్యంగ సూత్రాలకు లోబటి మేము పాదయాత్ర చేస్తాం. రాజధాని విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు కరపత్రాల ద్వారా, హ్యాండ్ మైక్ సెట్ల ద్వారా తెలియజేస్తాం. పాదయాత్ర సాంతం సీసీ కెమెరాలతో రికార్డు చేస్తాం. ఇవాళ రాజధాని లేని అనాథ రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. -గద్దె తిరుపతిరావు, అమరావతి పరిరక్షణ సమితి కో కన్వీనర్
4 జిల్లాల మీదుగా..
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర(Amravati farmers Maha padayatara) సాగనుంది. రోజూ రెండు విడతలుగా... 12నుంచి 14 కిలోమీటర్లు సాగేలా ప్రణాళిక రూపొందించారు. నవంబర్ 1న ప్రారంభమయ్యే పాదయాత్ర మొదటి 6 రోజులు గుంటూరు జిల్లాలో సాగి... పర్చూరు వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. నవంబర్ 8నుంచి 17వ తేదీ వరకూ పది రోజుల పాటు ప్రకాశం జిల్లాలో సాగనుంది. 18వ తేదీన నెల్లూరు జిల్లా కావలికి పాదయాత్ర చేరుకుంటుంది. ఈ జిల్లాలో అత్యధికంగా 16 రోజుల పాటు జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అదే నెల 15 వ తేదీ తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.
పలు పార్టీల మద్దతు..
రాజధాని రైతుల పాదయాత్రకు తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం సోషన్ మీడియా విభాగం-ఐ టీడీపీ ప్రతినిధులు యాత్రలో పాల్గొనున్నట్లు తెలిపారు. పాదయాత్ర ద్వారా అమరావతి ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని ఐకాస నేతలు చెబుతున్నారు.
ఇదీ చదవండి