గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 23న కృష్ణాయపాలెం వద్ద మూడు రాజధానులకు మద్దతుగా ఆటోలో వెళ్తున్న కొంత మంది ఎస్సీలను అదే గ్రామానికి చెందిన ఎస్సీలు, బీసీలు అడ్డగించారు. దీనిపై ఆగ్రహించిన కొంత మంది ఎస్సీలు కృష్ణాయపాలానికి చెందిన 11మంది ఎస్సీ, బీసీలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
గ్రామస్థులపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసును వెనక్కి తీసుకునేందుకు సమ్మతించినా... పోలీసులు తిరస్కరించారు. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో కేసును వెనక్కి తీసుకోబోమని తేల్చిచెప్పారు. కేసు పెట్టి 24 గంటలు కాకముందే పూర్తి స్థాయి విచారణ చేయకుండానే.. హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ఎస్సీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను నిలదీశారు. బయటకు వచ్చిన డీఎస్పీ దుర్గాప్రసాద్ వాహనం వద్ద నేతలు చుట్టుముట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఎస్సీ నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి