మొన్నటి వరకూ చలి.. ఉదయం పది గంటల వరకు మంచు.. వారంలోనే వాతావరణం మారిపోయింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 20తో పోలిస్తే.. తునిలో 8 డిగ్రీలకు పైగా పెరుగుదల నమోదైంది. గరిష్ఠంగా కృష్ణా జిల్లా నందిగామలో 39 డిగ్రీలు, అనంతపురంలో 38.6, కర్నూలులో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.
వారంలో 9 డిగ్రీలకుపైగా..
వారం క్రితం వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. బుధవారం వరకు 35 డిగ్రీల లోపే నమోదయ్యాయి. అక్కడ్నుంచి క్రమంగా పెరిగాయి. నందిగామలో ఫిబ్రవరి 20న 32.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. శనివారం 39 డిగ్రీలకు చేరింది. రాయలసీమలోనూ ఎండల ప్రభావం పెరిగింది. ఫిబ్రవరి 20న కడపలో 29.8 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత వారంలోనే 36.6 డిగ్రీలకు ఎగసింది. వారంతో పోలిస్తే ఉత్తరాంధ్రలో సగటున 4 డిగ్రీలకు పైగా అధికంగా నమోదవుతున్నాయి. తిరుపతిలోనూ ఎండల తీవ్రత పెరిగింది.
రాత్రి గజగజ.. పగలు చిరచిర
కృష్ణాజిల్లా నందిగామలో విచిత్ర పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు రాత్రి 17.8, పగలు 39 డిగ్రీలుగా ఉన్నాయి. కృష్ణాజిల్లాలో రాత్రివేళల్లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. విజయవాడలోనూ మంచు కురుస్తోంది.
* అనంతపురం, కడప జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీల నుంచి 38.6 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
రాత్రి వెచ్చగా.. పగలు చల్లగా
రాత్రి ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగానే ఉన్నా.. విశాఖపట్నంలో మాత్రం రాష్ట్రంలోనే ఎక్కువగా 24.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. అయితే పగటి ఉష్ణోగ్రత మాత్రం ఇక్కడ రాష్ట్రంలోనే కనిష్ఠంగా 31 డిగ్రీలు ఉంది.
ఈశాన్యం వేడిగాలులే కారణం: స్టెల్లా, సంచాలకులు, వాతావరణ కేంద్రం, అమరావతి
'ఒడిశాలోని భువనేశ్వర్‌లో గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అక్కడ ఎండల తీవ్రత పెరగడంతో.. ఉత్తరం నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి.'
ఇదీ చదవండి: