IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాంగణ ఎంపికల తొలిదశ రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలో ఈసారి అత్యధికంగా 427 మంది విద్యార్థులకు 466 ఆఫర్లు లభించాయి. వీటిలో 34 అంతర్జాతీయ, 82 ప్రీ ప్లేస్‌మెంట్ అవకాశాలు దక్కడం విశేషం. గతేడాది రెండు దశల్లో కలిపి వచ్చినవి 305 మాత్రమే. కరోనా ప్రభావంతో ప్రతికూలత తలెత్తిన వేళ ఈ స్థాయిలో ఆఫర్లు రావడం గర్వకారణమంటున్నాయి ఐఐటీ వర్గాలు.
Campus Placements in IIT Hyderabad : మొత్తం 668 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారానే సాగింది. విద్యార్థులు స్వస్థలాల్లో ఉంటూనే ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 210 సంస్థలు ముందుకొచ్చాయి. విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన 104 సంస్థల్లో.. ఫ్లిప్‌కార్ట్, ఇన్‌డీడ్, ఇన్‌ఫర్నియా, జేపీ మోర్గాన్, మీషో, మైక్రోసాఫ్ట్, న్యూజెరా, సిలికాన్ ల్యాబ్స్, సుజుకీ మోటార్ కార్పొరేషన్, జొమాటో ఉన్నాయి. డిసెంబరు 1 నుంచి 7 వరకు ప్రక్రియ సాగింది.ఈ ఎంపికల్లో అత్యధిక వార్షిక వేతనం రూ.65 లక్షలుండగా.. సగటువార్షిక వేతనం రూ.23 లక్షలుగా ఉంది.
స్మార్ట్ మొబిలిటీకి శత శాతం ఆఫర్లు..
Campus Placements in IIT : సెమిస్టర్ పొడవునా ఇంటర్న్‌షిప్ చేసేలా 33 మంది ఆయా సంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. గతేడాది వీరి సంఖ్య 12 మాత్రమే. ఎంటెక్‌లో ‘స్మార్ట్ మొబిలిటీ’ విభాగంలో తొలిబ్యాచ్ విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఈ కోర్సు చదివిన వారికి వందశాతం ఆఫర్లు రావడం విశేషం. ఈసారి భారత్‌కు చెందిన 10 అంకురసంస్థలూ 36 ఆఫర్లు ఇవ్వడం గమనార్హం. ఈ విషయంలో కొన్నాళ్లుగా చేపట్టిన చర్యలు ఫలించాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బీఎస్‌మూర్తి హర్షం వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి : ఒమిక్రాన్.. టెస్టుల్లో సైతం గుర్తించలేని కొత్తరూపంలో!