Telugu Mahilala Protest: మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 'జగన్ పాలనలో ఊరికో ఉన్మాది' పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అందించారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని కమిషన్ ఛైర్‌పర్సన్ పద్మ తెలిపారు.
వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించి, నిరసనలు తెలిపారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ అత్యాాచార బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
"కమిషన్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు 30 మంది వచ్చాం. కమిషన్‌కు ఫిర్యాదు చేసే హక్కు మాకుంది. ఆస్పత్రిలో అత్యాచారం కేసులో తీసుకున్న చర్యలు ఏమిటి? -వంగలపూడి అనిత, తెెెలుగు మహిళ అధ్యక్షురాలు
బొండా ఉమ: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం నాయకులకు నోటీసులు ఇచ్చే అధికారం మహళా కమిషన్‌కు లేదని బొండా ఉమ అన్నారు. తెలుగు మహిళ నాయకులతో కలిసి విజయవాడ ఆసుపత్రి అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మహిళా కమిషన్ ఛైర్మన్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడంలో ఉన్న శ్రద్ధ, బాధితులను ఆదుకోవడం, నిందితులను శిక్షించడంలో పెడితే బాగుంటుందని హితవు పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు..మహిళలపై అఘాయిత్యాలను నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఆడబిడ్డలకు రక్షణ కావాలి..జగన్ పాలన పోవాలంటూ.. నినాదాలతో కదంతొక్కారు. బాధితులకు న్యాయం చేయాలి.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు..
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. వైకాపా పాలనలో మహిళలపై అఘాయిత్యాలన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు
కర్నూలు: మహిళలపై అఘాయిత్యాలను వ్యతిరేకంగా తెలుగుదేశం పిలుపునిచ్చిన నిరసనలకు.. కర్నూలులో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. హత్య, అత్యాచార బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు
నెల్లూరు: జిల్లాలో తెలుగుమహిళల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రదర్శనలు చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి.. చీపురులు చేతపట్టి నిరసనలు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో ప్రధాన రహదారి వెంబడి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. మహిళలపై నేరాల ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
అనకాపల్లి జిల్లా: పాయకరావుపేటలో తెలుగు మహిళలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక సూర్యమహల్ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి ఉదాసీనత వల్ల.. నేరాలు మరింతగా పెరుగుతున్నాయని విమర్శించారు.
*చోడవరంలోనూ.. తెదేపా నాయకులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీని ప్రారంభించి.. పట్టణం గుండా కొనసాగించారు.
కోనసీమ జిల్లా: పి.గన్నవరంలో నియోజకవర్గ స్థాయిలో తెదేపా నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తహసీల్దారు కార్యాలయం వద్దకు నిరసన ర్యాలీగా వెళ్లి.. ధర్నాకు దిగారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఉప తహసీల్దారుకు అందజేశారు.
ఇదీ చదవండి: Ramya Case Judgement: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తి.. మరో రెండ్రోజుల్లో తీర్పు