తెలుగుదేశం పార్టీ కార్యాలయం, నాయకులపై దాడులకు నిరసనగా తెదెపా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో.. తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అయితే.. ఆందోళనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు.. తెదేపా నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేశారు. మరికొంత మందిని గృహనిర్భంధంలో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగింది.
ప్రకాశం జిల్లా...
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తెల్లవారుజామునే ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని నిరసనలు చేపట్టారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మార్కాపురంలో బస్సులు బయటకి వెళ్లకుండా గేటు వద్ద బైఠాయించిన తెదేపా నేత నారాయణరెడ్డితోపాటు మిగిలిన వారిని అరెస్ట్ చేశారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావును గృహనిర్బంధం చేశారు. కంభంలో జాతీయ రహదారిపై తెదేపా నాయకులు రాస్తారోకో చేస్తుండగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా..
రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసేందుకు నరసరావుపేట నియోజకవర్గంలో తెదేపా నాయకులు తెల్లవారుజామున ర్యాలీ చేపట్టారు. పట్టణంలో తెదేపా కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట పోలీసులు.. ఓవర్ బ్రిడ్జిపై ర్యాలీని అడ్డుకుని తెలుగుదేశం ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద బాబును అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులోనూ నేతలను అరెస్టు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా..
జిల్లా వ్యాప్తంగా తెదేపా నాయకులను గృహనిర్బంధం చేశారు. దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులును గృహనిర్బంధం చేశారు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద కార్యకర్తలను అరెస్టు చేశారు.
విజయనగరం జిల్లా ..
విజయనగరం జిల్లా సాలూరు వద్ద జాతీయ రహదారిపై తెదేపా నేతలు నిరసనకు దిగారు. దీంతో.. వాహనాలు నిలిచిపోయాయి.
శ్రీకాకుళం జిల్లా..
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవితోపాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న వారిని ఠాణాకు తరలించారు.
చిత్తూరు జిల్లా..
బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించినట్లు తిరుపతి అర్బన్ పోలీసులు ప్రకటించారు. తిరుమల వచ్చే యాత్రికులకు అసౌకర్యం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు జిల్లావ్యాప్తంగా తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఎన్టీఆర్ కూడలి వద్ద తెలుగు యువత నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు రవినాయుడు, మునికృష్ణను అరెస్టు చేశారు.
విశాఖ జిల్లా..
విశాఖలో టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్, అరేటి మహేశ్‌లను ముందస్తు అరెస్టు చేశారు. తెదేపా నేత పాసర్ల ప్రసాద్ ను అరెస్టు చేసి.. గోపాలపట్నం పీఎస్‌కు తరలించారు.
కర్నూలు జిల్లా..
కర్నూలు జిల్లా నంద్యాలలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్, భూమా బ్రహ్మానందరెడ్డిని హౌజ్ అరెస్టు చేశారు. కడప జిల్లా మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్‌ను అరెస్టు చేశారు. రాజంపేటలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న తెదేపా నేతలను అరెస్టు చేశారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. వెలుగోడు మండలం వేల్పనూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు.
ఇవీ చదవండి : YCP ATTACK: తెదేపా కార్యాలయాలపై కర్రలు, రాళ్లతో దాడులు.. అట్టుడికిన రాష్ట్రం