Dead body in Water tank case : కలకలం సృష్టించిన హైదరాబాద్ ముషీరాబాద్ రీసాలగడ్డలోని తాగు నీటి ట్యాంకులో మృతదేహం వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. మృతుడు చిక్కడపల్లి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కిశోర్‌గా గుర్తించారు. ఘటనాస్థలిలో లభ్యమైన చెప్పుల ఆధారంగా మృతదేహాం కిశోర్‌దేనని తేల్చారు. కిశోర్ అదృశ్యంపై 15 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల కనిపించకుండా పోయిన వ్యక్తుల కేసులపై పోలీసులు ఆరా తీశారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులపై దృష్టిసారించారు.
ఫిర్యాదులు చేసినా..
రాంనగర్ ఎస్ఆర్ నగర్‌లోని నీటి ట్యాంక్‌లో కుళ్లిన మృతదేహం లభ్యమవగా.. చనిపోయింది అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కిశోర్ అని పోలీసులు నిర్ధరించారు. స్థానికులు ఇదే ట్యాంకులోని నీటిని తాగుతుండటంతో ఆందోళన చెందారు. నీళ్లు దుర్వాసన వస్తున్నాయని జలమండలి అధికారులకు ఫిర్యాదుచేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఉంటే మృతదేహాన్ని ముందే గుర్తించేవారని స్థానికులు చెబుతున్నారు.
ముందే స్పందించి ఉంటే
Dead body in Water tank: ఈ ట్యాంక్ నీరు నాలుగు బస్తీలకు వెళ్తుంది. శివస్థాన్‌పూర్, హరినగర్, పద్మశాలి కాలనీ సహా మరో బస్తీకి ఈ నీరు సరఫరా అవుతోంది. ఈ వారంలో ఓ ఇంట్లో.. నీటిలో నుంచి వెంట్రుకలు, మాంసం ముద్దలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని స్థానిక కార్పొరేటర్ తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అందుకు కారణం గుర్తించలేకపోయారని స్థానికులు తెలిపారు.
హత్యా..? ఆత్మహత్యా..??
గత కొద్ది రోజులుగా నీటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. చిన్నారులకూ ఇదే నీటిని తాగించామని.. వేడి చేసుకొని తాగినా దుర్వాసన వచ్చేదని చెప్పారు. మరో వైపు నీటి ట్యాంకులో దొరికిన మృతదేహంపై.. హత్యచేసి పడేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. ప్రమాదవశాత్తు జరిగిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచదవండి.