తెలుగు అకాడమీ (Telugu Academy) ఇన్‌ఛార్జి సంచాలకుడు సోమిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ) నుంచి తొలగించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించింది. ఆమె శుక్రవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. విచారణకు నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోపక్క పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లోని ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావు, మేనేజర్(ఆపరేషన్) వేదుల పద్మావతి, రిలేషన్‌షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్‌లు ఈ (Telugu academy scam) వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో ఉన్న సత్యనారాయణను హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారించామని అనంతరం వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించామని సంయుక్త పోలీస్ కమిషనర్(నేర పరిశోధన) అవినాష్ మహంతి తెలిపారు. ఎఫ్‌డీల నగదు బదిలీలతో సంబంధమున్న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా(యూబీఐ) మేనేజర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
యూబీఐ నుంచి ఏపీ మర్కంటైల్‌కు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలుగు అకాడమీ (Telugu academy) గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో సుమారు రూ.60 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. ఈ మొత్తం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఎఫ్‌డీలను వెనక్కు తీసుకునేందుకు గత నెల 24న అకాడమీ (Telugu academy) ప్రయత్నించగా.. అందులో ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో అకాడమీ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యూబీఐ మేనేజర్లను విచారించారు. ఆ మొత్తం తమ బ్యాంకు నుంచి ఏపీ మర్కంటైల్ సొసైటీకి బదిలీ అయినట్టు చెప్పారు.
గతంలో కిడ్నాపర్లకు రూ.37 లక్షలు
ఏపీ మర్కంటైల్ సొసైటీ నిర్వహిస్తున్న సత్యనారాయణరావును ఏడాదిన్నర కిందట నలుగురు వ్యక్తులు ముంబయిలో కిడ్నాప్ చేశారని పోలీసులు తెలుసుకున్నారు. విజయవాడ కేంద్రంగా సొసైటీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న అతడు నాగ్‌పుర్‌లోనూ శాఖను ప్రారంభించాడు. గతేడాది మార్చిలో అంకిత్ జైన్ అనే వ్యక్తి ఫోన్ చేసి... మీ బ్యాంక్‌లో రూ.5 కోట్లు డిపాజిట్ చేస్తాను.. ముంబయికి వచ్చి నగదు తీసుకెళ్లండని చెప్పాడు. సత్యనారాయణ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మొహియుద్దీన్‌తో కలిసి ముంబయికి వెళ్లాడు. రైల్వేస్టేషన్‌లో దిగగానే అంకిత్‌జైన్ ఫోన్ చేశాడు. కారు పంపుతున్నాం.. మీరొక్కరే రండి అని చెప్పాడు. సత్యనారాయణ ఆ కారులో ఎక్కాడు. మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కారు. కారులోనే అతడిని కొట్టారు. రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి రూ.కోటి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. చివరకు రూ.37 లక్షలకు బేరం కుదిరింది. అనంతరం కిడ్నాపర్లు మొహియుద్దీన్‌కు ఫోన్ చేసి ఫలానా ఖాతాల్లో నగదు జమచేయాలంటూ ఆదేశించారు. అతడు విజయవాడ నుంచి నగదు తెప్పించుని కిడ్నాపర్లు సూచించిన ఖాతాల్లో నగదు వేశాడు. నగదు చేరడంతో కిడ్నాపర్లు సత్యనారాయణ వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని రూ.300 చేతికిచ్చి పుణె హైవేలో వదిలేసి వెళ్లారు. అతడు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అకాడమీ పేరుతో నకిలీ ఖాతాలు
ఏపీ మర్కంటైల్ సొసైటీలో రికార్డులను పోలీసులు పరిశీలించగా విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయి. కొందరు యూబీఐ నుంచి ఇక్కడకు సొమ్మును బదిలీ చేయించారని తేలింది. వారు రెండు నెలల కిందట తెలుగు అకాడమీ పేరుతో రెండు నకిలీ ఖాతాలను రూ.60 కోట్లతో ప్రారంభించారు. అనంతరం తాము తెలుగు అకాడమీ ఉద్యోగులమంటూ తప్పుడు పత్రాలు సృష్టించి వ్యక్తిగత ఖాతాలు తెరిచారు. తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే రూ.60 కోట్ల నగదు విత్‌డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఏ ఖాతాలోనూ సొమ్ము లేదు. నకిలీ ఖాతాలు సృష్టించేందుకు సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావు, పద్మావతి, మొహియుద్దీన్‌లు 10 శాతం కమీషన్ తీసుకున్నారు. రూ.కోట్లలో నగదు ఎందుకిచ్చారని ప్రశ్నించగా.. భవన నిర్మాణం కోసమని వారు చెప్పారని సత్యనారాయణరావు పోలీసులకు తెలిపారు. అకాడమీకి చెందిన ఎఫ్‌డీలను విత్‌డ్రా (Telugu academy scam) చేసుకున్న వారి వివరాలు పోలీసు అధికారులకు తెలిసినా.. వారిని ఇంకా అరెస్టు చేయలేదు.
- తెలుగు అకాడమీ (Telugu academy) నుంచి ఎఫ్‌డీ పత్రాలు, రసీదులు తీసుకున్న వ్యక్తులు వాటికి నకిలీలను తయారు చేశారు. యూబీఐ, కెనరా బ్యాంకుల్లో అసలు ఎఫ్‌డీ పత్రాలు, రసీదులు సమర్పించారు. నకలు పత్రాలు, రసీదులు అకాడమీ ఫైళ్లలో భద్రంగా ఉన్నాయి.
- అకాడమీ ఉన్నతాధికారులు ఆర్థిక వ్యవహారాలను పరిశీలించినప్పుడు నగదు కొట్టేసిన వ్యక్తులే (Telugu academy scam) ఉద్దేశపూర్వకంగా ఎఫ్‌డీల ప్రస్తావన రాకుండా చేశారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఎఫ్‌డీల వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లిందని తెలుసుకున్న తర్వాత నలుగురు ఉద్యోగులు ఫోన్లు స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: nara lokesh: మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు లోకేష్ నివాళులు..