కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు కలిసి పాల్గొన్నందున నిష్పక్షపాత నివేదిక ఎలా సాధ్యమని తెలంగాణ సందేహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు గురువారం లేఖ రాశారు.
‘‘జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో తెలంగాణ చేసిన ఫిర్యాదు మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం.. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై వాస్తవ నివేదిక ఇవ్వాలని ట్రైబ్యునల్ బోర్డును ఆదేశించింది. తీవ్ర జాప్యం తర్వాత ఈ నెల 11న కమిటీ పర్యటించింది. ఫిర్యాదీలుగా వాస్తవ పరిస్థితిని వివరించేందుకు తమ ప్రతినిధిని కూడా కమిటీతో పాటు అనుమతించాలని బోర్డు ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా కోరినా తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తటస్థ కమిటీతో వెళ్లేందుకూ అనుమతించలేదు. కమిటీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, పలువురు చీఫ్ ఇంజినీర్లు పాల్గొని కమిటీతో చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు ఓ పత్రికలో వచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ నిష్పక్షపాతంగా నివేదిక ఇస్తుందా? అన్నదానిపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి’’ - రజత్‌కుమార్, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
‘ముచ్చుమర్రి’, ‘మల్యాల’ ‘బనకచెర్ల’ నుంచి..
కేసీ కాలువకు ఆంధ్రప్రదేశ్ అనధికారికంగా నీటిని మళ్లిస్తోందని, దీనిని వెంటనే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచెర్ల క్రాస్‌రెగ్యులేటర్ నుంచి ఎస్కేప్‌ఛానల్ ద్వారా అనధికార నీటి మళ్లింపు జరుగుతోందని బోర్డు దృష్టికి తెచ్చారు.
లేఖలోని ప్రధానాంశాలు..
‘‘కేసీకాలువ తుంగభద్ర నుంచి 19వ దశాబ్దంలో నేవిగేషన్ కాలువగా చేపట్టి తర్వాత సాగునీటి కాలువగా మార్చారు. 1860లో హైదరాబాద్ రాష్ట్రం సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మాణానికి మద్రాసు రాష్ట్రానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ రాష్ట్రానికి నీటిని మళ్లించినపుడు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదని 1944లో తుంగభద్ర నీటిని ఎడమవైపు ఆర్డీఎస్ కాలువ ద్వారా, కుడివైపు కేసీ కాలువ ద్వారా నీటి వినియోగానికి ఒప్పందం జరిగింది. 1951లో జరిగిన అంతర్‌రాష్ట్ర సదస్సులో కేసీ కాలువ కింద అప్పటికే ఉన్న వినియోగం పది టీఎంసీలుగా, నిర్మాణంలో ఉన్న ఆర్డీఎస్ కింద 17 టీఎంసీలుగా పేర్కొన్నారు. అయితే బచావత్ ట్రైబ్యునల్ ముందు అంతకు ముందు జరిగిన ఒప్పందాలను పక్కనపెట్టి కర్ణాటకతో కలిసి కేసీ కాలువకు 39.90 టీఎంసీల రక్షణ పొందింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఇదో ఉదాహరణ మాత్రమే. అయితే కేసీకాలువకు పది టీఎంసీలకు మించి వినియోగించుకోవడానికి వీల్లేదని తెలంగాణ కృష్ణా ట్రైబ్యునల్ -2 ముందు సవాలు చేసింది. ఈ అంశాన్ని ట్రైబ్యునల్ తీవ్రంగా పరిగణిస్తోంది. 1981లో ఆంధ్రప్రదేశ్ కేసీకాలువ నుంచి ఎనిమిది టీఎంసీలను ఎస్సార్బీసీకి పునఃకేటాయింపు చేసింది. ట్రైబ్యునల్‌కు సమర్పించిన సమాచారం ప్రకారం కేసీకాలువకు 31.9 టీఎంసీలకు బదులు 54 టీఎంసీలు వినియోగించారు. అదే తెలంగాణలోని ఆర్డీఎస్ కాలువ 15.9 టీఎంసీలకు గాను ఐదు టీఎంసీలు కూడా వినియోగించుకోలేకపోతోంది. దీనికి కొనసాగింపుగా 2017లో శ్రీశైలం నుంచి 798 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకొనేలా ముచ్చుమర్రి నిర్వహణలోకి వచ్చింది. కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకొంటూ అదనంగా మరొకటి నిర్మించింది. దీంతోపాటు ఎస్కేప్‌ఛానల్, ముచ్చుమర్రి ద్వారా ఎక్కువ నీటిని మళ్లిస్తోంది. బచావత్ ట్రైబ్యునల్ తుంగభద్ర నీటి వినియోగంలో పరిమితులు విధించి ప్రధాన కృష్ణాకు ఈ నీరు రావాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ప్రధాన కృష్ణాలోని ప్రాజెక్టులు, హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుంది. వీటినుంచి నీటిని మళ్లించకుండా ఆపాలని’’ తెలంగాణ కోరింది. ఇదే విషయాన్ని కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. గతంలో జరిగిన ఒప్పందాలు, కేసీకాలువ, ఆర్డీఎస్ కింద నీటి వినియోగం, అనధికార నీటి మళ్లింపునకు సంబంధించిన మ్యాప్‌లను జత చేసింది.