చిల్లర మార్కెట్‌లో కిలో కందిపప్పు ప్రస్తుతం రూ.100 నుంచి 110 వరకూ ధర పలుకుతోంది. కానీ గత ఏడాది రైతుల నుంచి మద్దతు ధరకు కొన్న రెండున్నర లక్షల క్వింటాళ్ల కందులను తెలంగాణ సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్) అతి తక్కువ ధరకే వ్యాపారులకు అమ్మింది. క్వింటా కందులను రూ.4,181 చొప్పున కొంటామంటూ వ్యాపారులు వేసిన టెండర్లను ఆమోదించి అప్పగించింది. క్వింటా కందులను ఆడిస్తే 68 కిలోల పప్పు వస్తుంది. అంటే కిలో పప్పు రూ.61.48కే వ్యాపారులకు దక్కినట్లయింది!
నిజానికి 2019లో కందులను క్వింటాకు ఖర్చులన్నీ కలిపి రూ.5,675కు రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. కొన్న ఖర్చులు, నిల్వ, రవాణా, గోదాముల అద్దెలు తదితరాలన్నీ కలిపి క్వింటా సరకును రూ.6వేలకు అమ్మితేనే సొమ్ము మొత్తం వెనక్కి వచ్చేది. కానీ రూ.4,181కే అమ్మడం వల్ల మార్క్‌ఫెడ్‌కు రూ.60కోట్ల వరకూ నష్టం వచ్చింది. బహిరంగ మార్కెట్‌లో కందులు అమ్మడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని, నాలుగోసారి టెండర్‌లో వ్యాపారులు కోట్ చేసిన ఎల్1 ధర రూ.4,181కే ఇచ్చినట్లు మార్క్‌ఫెడ్ ప్రభుత్వానికి నివేదించింది. పాత కందులు కావడం వల్ల ధర పెద్దగా రాలేదని తెలిపింది.
పప్పుగా మార్చేందుకు టెండర్లు
లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా కందిపప్పు పంపిణీకి వీలుగా ‘జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య’ (నాఫెడ్) ద్వారా 1.75 లక్షల క్వింటాళ్ల కందులను రాష్ట్రానికి కేటాయించింది. పప్పుగా మార్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. పప్పు మిల్లుల ఎంపికకు ‘ఆసక్తి వ్యక్తీకరణ’ కోరుతూ ప్రకటన జారీచేసింది. ఈ నెల 5లోగా దరఖాస్తు చేయాలని కోరింది. దరఖాస్తు చేసిన వాటిలో సామర్థ్యమున్న మిల్లులను ఎంపిక చేసి ఈనెల 6న మళ్లీ వాటి నుంచి టెండర్లు ఆహ్వానిస్తారు.
100 కిలోల కందులిస్తే మరపట్టి 68 కిలోల కందిపప్పు ఇవ్వడానికి ముందుకొచ్చే మిల్లులను ఎంపిక చేయాలని నాఫెడ్ సూచించింది. మార్క్‌ఫెడ్ వద్దనున్న రెండున్నర లక్షల క్వింటాళ్ల పాతకందులను సైతం టెండర్ల ద్వారా అమ్మకుండా ఇలా పప్పుచేసి రేషన్ దుకాణాల ద్వారా అమ్మితే బహిరంగ మార్కెట్‌లో ధర పెరగకుండా ఉండేదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ చేయకపోవడం వల్లనే కందులను నేరుగా అమ్మినట్లు మార్క్‌ఫెడ్ వర్గాలు వివరించాయి.
ఇదీ చూడండి: