Telangana Government Jobs Notification: ఉద్యోగ నియామకాల కోసం యువత ఎదురుచూపులు త్వరలో ఫలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు జారీచేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక నియామకాలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను గత డిసెంబర్లో చేపట్టారు. కొత్త స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన, కేటాయింపులు పూర్తిచేసి అందుకు అనుగుణంగా బదిలీలు కూడా చేశారు. ఆ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయినట్లేనని తెలుస్తోంది. స్పౌస్ కేసులు, అప్పీళ్లకు సంబంధించి అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు మిగిలినట్లు సమాచారం. అవి కూడా నేడో, రేపో పూర్తికానున్నాయి. తాజాగా పరస్పర బదిలీలకు కూడా సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది.
నియామకాలపై దృష్టి..
విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులతో ఇందుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. గతంలో శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను ఉద్యోగుల విభజన అనంతరం ఏర్పడిన ఖాళీలతో అధికారులు సరి చూస్తున్నారు. అన్ని వివరాలు, సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్రోడీకరిస్తున్నారు. తొందర్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.
50 వేలకు పైగా ఖాళీలు..
50 వేలకు పైగా ఖాళీల భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చేలా నియామకాలకు సంబంధించిన కసరత్తు పూర్తిచేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలలోనే కొన్ని నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీచూడండి: ap in Parliament: పోలవరం ముంపు బాధితుల్లో 1.64 లక్షల మంది గిరిజనులు