తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. కార్మికుల హఠాన్మరణాలతో సమస్య పెరిగి పెద్దదవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విలీనం డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తోన్న దృష్ట్యా కేంద్ర చట్టాన్ని అనుసరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు పోను మిగతా 20 శాతం ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి ఇవ్వాలన్నది కేసీఆర్ సర్కారు ఆలోచన. అందుకు అనుగుణంగా ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతిస్తూ కొన్ని మార్గాల ప్రైవేటీకరణకు సంబంధించి కేబినెట్లో విధానపర నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఆర్టీసీని మూడుగా విభజిస్తూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం. మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి సమూల మార్పే ధ్యేయంగా మంత్రివర్గం కీలకనిర్ణయాలను తీసుకోనుంది.
ఇవీ చూడండి: