గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భారత అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర అధిపతిగా గవర్నర్ నిర్ణయం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు యనమల ఆకాంక్షించారు. రెండు బిల్లులూ శాసనసభలో ఆమోదించినా మండలి సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం రాజధాని అమరావతిని నాశనం చేసి ఆ స్థానంలో 3 రాజధానులంటోందని ఆయన మండిపడ్డారు. ఇందుకు రెండు బిల్లులను దుర్మార్గంగా రూపొందించిందని విమర్శించారు.
జనవరిలో ఈ రెండు బిల్లులను శాసమండలి సెలెక్ట్ కమిటీకి పంపిందన్న యనమల...అక్కడ పెండింగ్‌లో ఉండగానే జూన్ బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ బిల్లులు సభ ముందుకు తేవడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీలో బిల్లులను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా మండలి అధికారాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీ వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందునే వాటిని మండలిలో మళ్లీ ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. ఇప్పుడు గవర్నర్ ఆమోదం కోసం బిల్లులను ప్రభుత్వం పంపాలని చూస్తోందన్నారు.