నేతి బీరకాయలో నెయ్యి మాదిరే సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రెడ్డి షాడో లతో బడుగు, బలహీన వర్గాలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడమే.. వైకాపా సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు.
జగన్‌రెడ్డి అవినీతి విస్తరణకు తప్ప.. మంత్రివర్గ విస్తరణతో బలహీన వర్గాలకు ఉపయోగం ఏమీ లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల మీద కేసులు పెట్టి, బెదిరింపులు, వేధింపులు, హత్యలు, అవమానాలకు గురిచేయడమేనా జగన్‌రెడ్డి సామాజిక న్యాయమంటే అని ప్రశ్నించారు.
‘క్యాబినెట్‌లో 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించామని చెప్పే జగన్‌రెడ్డి ఏ ఒక్కరికీ స్వతంత్రంగా పనిచేసే వీలు కల్పించలేదు. అందరిపై సీఎం తన సామాజికవర్గం వారిని షాడోలుగా నియమించారు. సజ్జల వంటి రాజ్యాంగేతర శక్తులను షాడో మంత్రులుగా ప్రోత్సహించడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అవమానించడమే. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, కోస్తాలో సజ్జల రామకృష్ణారెడ్డి, రాయలసీమలో వైవీ సుబ్బారెడ్డిని ఇన్‌ఛార్జులుగా నియమించి అన్ని వర్గాలనూ డమ్మీలను చేశారు.
తితిదే ఛైర్మన్ పదవిని రెండుసార్లు ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టడంసామాజిక న్యాయమా? జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది. ఆ వ్యతిరేకతను తప్పించుకోవాలనే మంత్రి పదవుల పేరుతో రాజకీయం చేస్తున్నారు’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఇదీ చదవండి: 25 మందితో కొత్త కేబినెట్.. జగన్ టీమ్ ఇదే!