వ్యవసాయ చట్టాలపై వైకాపా దిల్లీలో ఓ డ్రామా.. గల్లీలో మరో డ్రామా ఆడుతోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఫేక్ పార్టీ, ఫేక్ ఫెలోస్ అనే నైజం వైకాపాలో మరోమారు రుజువైందని మండిపడ్డారు. రాజ్యసభ వేదికగా విజయసాయి రెడ్డి, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ చేసిన ప్రసంగాల వీడియోలను పట్టాభి ప్రదర్శించారు.
'వ్యవసాయ బిల్లులపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా విజయసాయిరెడ్డి గుడ్డిగా సమర్థించారు. కనీస మద్దతు ధర అంశంపై నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. రాజ్యసభలో విజయసాయి చేసిన వీరోచిత పోరాటాన్ని వ్యవసాయ మంత్రి కన్నబాబు ఓసారి పరిశీలించాలి. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆరోజు సవరణలు ప్రతిపాదించలేదు.'
---కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి
- డ్రామాలతో రైతుల్ని ముంచారు
పంటల బీమా ప్రీమియం చెల్లింపుల్లోనూ ఇదే తరహా మోసపూరిత విధానంతో రైతుల్ని మోసగించారని పట్టాభిరామ్ ఆరోపించారు. రైతుల్ని ఇన్ని రకాలుగా కష్టపెడుతున్నందుకు కన్నబాబు సిగ్గుపడాలన్నారు. డ్రామాలతో రైతుల్ని ముంచిన ప్రభుత్వం వైకాపా, ఇప్పటికైనా కేసుల విషయాన్ని పక్కనపెట్టి రైతుల పక్షాన నిలబడాలన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వచ్చే వరకూ తెదేపా రైతుల పక్షాన నిలబడుతుందని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ఏలూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి తెదేపా ఫిర్యాదు