సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఈసీకి ఉద్యోగులు సహకరించరని చెబుతున్న పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. తక్షణం బర్తరఫ్ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌కు.. వ్యతిరేకంగా పని చేయమని ఉద్యోగులను పరోక్షంగా రెచ్చగొడుతున్న ఆయనపై కుట్ర కేసు పెట్టాలని ఎస్ఈసీని కోరారు. రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన మంత్రే.. రాజ్యాంగస్పూర్తికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని నేరంగా పరిగణించాలన్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించడాన్ని సుధాకర్ రెడ్డి ఆక్షేపించారు. వేలాది మందితో ఊరేగింపులు చేస్తున్న నాయకులకు.. ఎన్నికలనగానే కరోనా గుర్తుకు రావడం విడ్డూరమని మండిపడ్డారు. ఎన్నికల పేరు చెప్పగానే భయపడుతున్న రామచంద్రారెడ్డి.. కొందరు నిమ్మగడ్డతో కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు.
ఇదీ చదవండి: