40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏనాడూ బేలగా మారలేదు. బెంగపడలేదు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన కంట నీరు పెట్టడం సహచరులెవరూ చూడలేదు. దేశంలోనే సీనియర్ నాయకు(seanear leader in andhrapradesh)ల్లో ఒకరిగా, వ్యూహచతురుడిగా, దార్శనికుడిగా పేరుపొంది, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఆయన... శాసనసభలో జరిగిన అవమానంతో చలించిపోయి గుండెలవిసేలా రోదించారు. శాసనసభ ఆయనకు కొత్తకాదు. సభలో ఆవేశకావేశాలు, రాజకీయ విమర్శలు, ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితులూ కొత్తకాదు. ఎందరో నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. ధీటుగా నిలబడ్డారు. కానీ నిండు సభలో... వైకాపా ఎమ్మెల్యేలు తన సతీమణిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్రంగా కుంగిపోయారు.
బాధను నియంత్రించుకోలేక...
సభలో జరిగిన పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన తెలుగుదేశం నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్(NTR Bhavan) కు హుటాహుటిన పెద్దఎత్తున తరలి వచ్చారు. పార్టీ సహచరుల్ని చూశాక చంద్రబాబు అంతరంగంలో సుడులు తిరుగుతున్న బాధను నియంత్రించుకోలేకపోయారు. వారి ముందే బోరున విలపించారు. తన భార్య వ్యక్తిత్వాన్నే కించపరిచేలా వ్యాఖ్యలు చేశాక ఇక సభలోకి అడుగు పెట్టకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక బోరున విలపించారు.
చలించిపోయిన నేతలు...
2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనప్పుడూ ఆయన పోరాటం ఆపలేదు. 60 ఏళ్లు దాటిన వయసులోను సుదీర్ఘ పాదయాత్ర చేసి..పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2019 ఎన్నికల్లో పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడూ ఆయన కుంగిపోలేదు. ప్రభుత్వ నిర్బంధాల్ని, ఆంక్షల్ని, పార్టీ నాయకులపై పెడుతున్న కేసుల్ని, కార్యకర్తలపై కొనసాగుతున్న వేధింపుల్ని తట్టుకుని నిలబడ్డారు. చివరకు పార్టీ కేంద్ర కార్యాలయంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డా చలించలేదు. అలాంటి నాయకుడు ఏడ్వడంతో ఆయన సహచరులు, పార్టీ నాయకులు చలించిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు సమస్యలను పట్టించుకోకుండా...చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు బూతులు మాట్లాడారు. ఇలాంటి వారికా మనం ఓట్లు వేసి గెలిపించింది..?
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా శాసనసభాపక్ష ఉపనేత
పరిస్థితులను బట్టి నిర్ణయం...
అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా. ప్రస్తుత శాసనసభ, శాసనమండలి సమావేశాల్ని పూర్తిగా బహిష్కరించాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది. భవిష్యత్తులో జరిగే సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లాలా వద్దా అన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయించనున్నారు.
ఎంతో నిబ్బరంగా ఉండే చంద్రబాబునాయుడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే మేము తీవ్రంగా బాధపడ్డాం. ఆయన అంతలా బాధపడ్డారంటే వాళ్లు ఏమేం అన్నారో అర్థం చేసుకోవచ్చు. వైకాపా ప్రజావ్యతిరేక కార్యకలాపాలను బయటపెడతున్నారన్న కక్షతో వ్యక్తిగత విమర్శలు చేస్తారా...?
- పీతల సుజాత, మాజీ మంత్రి
ఇవీచదవండి.