అభివృద్ధి, నిర్మాణానికి తెదేపా ప్రతిరూపం అయితే.. అవినీతి, విధ్వంసాలకు వైకాపా ప్రతిబింబమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 10 శాతం మందికి ఆర్థిక సాయం చేసి.. 90 శాతం మందికి నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం తెదేపా నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మునిరత్నం, మనోహర్, ఏరియా కన్వీనర్లు, మండల పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. అందరితో పాటు ఇచ్చే పథకాలకు కార్పొరేషన్ల ఖర్చులో చూపించి.. ఆయా వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
అభివృద్ధి ఆగింది
గతేడాదిగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. ఏడాది పాలనలో జలవనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. తమ హయాంలో సీఎం నియోజకవర్గమైన పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడామని గుర్తు చేశారు. అలాంటిది కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకపోవడం రాజకీయ కక్ష సాధింపేనని ఆయన స్పష్టం చేశారు. తెదేపాపై కక్షతోనో.. వ్యక్తిగత కక్షతో పనులు ఆపేసి ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడం కన్నా దుర్మార్గ చర్య మరొకటి ఉండదని చంద్రబాబు ఆక్షేపించారు.
స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు
వైకాపా నేతలు స్కీమ్‌ల పేరుతో స్కాములు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్ల స్థలాల ముసుగులో రూ.1600 కోట్ల స్కామ్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదన్న ఆయన.. లారీ ఇసుక రూ.20 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. నాసిరకం మద్యం బ్రాండ్లను అధిక ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. సంక్షేమంలో తప్పుడు లెక్కలతో పేదలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి..