పరిషత్ ఎన్నికల్లో తెదేపా అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాధికారాన్ని అధినేత చంద్రబాబుకే వదిలేస్తూ తెలుగుదేశం పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగినందున కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని తాము కోరితే.. పాత నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ విడుదల చేయడాన్ని తెదేపా తప్పుబట్టింది. ఎన్నికలు బహష్కరించాలని మెజారిటీ నేతలు పొలిట్ బ్యూరోలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్‌లు మాత్రం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నందున వారి పరిస్థితి ఏమిటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. 25 శాతం స్థానాలు ఏకగ్రీవమైతే 75 శాతం స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సబబు కాదని వారు అన్నట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోటీలో ఉన్న అభ్యర్థులకే నిర్ణయాధికారాన్ని వదిలేసి పార్టీపరంగా మాత్రం దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని ఇంకొందరు నేతలు వెల్లబుచ్చారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నామని పార్టీపరంగా ప్రకటించి.. పోటీ చేయాలా వద్దా అనేది బరిలో ఉన్న అభ్యర్థుల ఇష్టమంటూ ప్రకటన ఇవ్వడం సబబు కాదని సీనియర్లు స్పష్టం చేశారు.
న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగానే నోటిఫికేషన్ జారీ చేయడం అధికార దుర్వినియోగమే అని పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలను తెదేపా బహిష్కరించడమే సబబని వారు సూచించినట్లు తెలిసింది.
గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వైకాపా నేతలు అధికార దుర్వినియోగంతో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారనే విషయాన్ని మాజీ ఎస్‌ఈసీ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ప్రస్తావించడాన్ని నేతలు గుర్తు చేశారు. ఎస్‌ఈసీనే అధికార దుర్వనియోగం జరిగిందని నిర్ధరించినందున పాత నోటిఫికేషన్‌తో ఎన్నికలు నిర్వహించడం అర్థరహితమని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ అధినేత తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని పొలిట్‌బ్యూరో సభ్యులు స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని చంద్రబాబు వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: పవన్