TDP Narendra wife letter to High Court Chief Justice: తెదేపా నేత, తన భర్త దారపనేని నరేంద్ర అక్రమ అరెస్టుపై ఆయన భార్య సౌభాగ్యం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 12వ తేదీ రాత్రి ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను అక్రమంగా తీసుకెళ్లారని లేఖలో పేర్కొన్నారు. బలవంతంగా ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగగా తాము సీఐడీ పోలీసులమని చెప్పారని ఆమె తెలిపారు. చేతిరాతతో రాసిన ఒక లేఖపై తన చేత సంతకం తీసుకున్నారన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొంతమంది పోలీసు అధికారులు తన భర్తను కిడ్నాప్ చేశారని సౌభాగ్యం ఆరోపించారు. తాను, తన పిల్లలు తీవ్ర భయాందోళనలో ఉన్నామన్నారు. ఎవరో, ఏమిటో చెప్పకుండా తమ ఇంటిలోకి చొరబడి తన భర్తను ఎలా అరెస్ట్ చేస్తారని, తన భర్త చేసిన తప్పేంటని ప్రశ్నించారు. సెక్షన్ 41ఏ ప్రకారం తన భర్తకు నోటీసు ఎందుకివ్వలేదని నిలదీశారు.
ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు ఎందుకు పాటించలేదని సౌభాగ్యం ప్రశ్నించారు. తన భర్త ఆరోగ్యానికి, ఆయన ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని నిలదీశారు. అర్ధరాత్రులు ఎవరి ఇంటిలోకైన చొరవబడే హక్కు.. పోలీసులకు ఉందా అన్న ఆమె.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ విధంగానే పనిచేస్తున్నాయా అంటూ మండిపడ్డారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పోలీసులు ఉల్లంఘించారన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే దానికి సీఐడీ పోలీసులదే బాధ్యత అన్నారు. సీఐడీ పోలీసుల దుశ్చర్యలపై కలుగజేసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. తన భర్తను అక్రమంగా కిడ్నాప్ చేసిన సీఐడీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సౌభాగ్యం డిమాండ్ చేశారు.
మరోవైపు సీఐడీ పోలీసులు నరేంద్రను కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం జీజీహెచ్ వైద్యులను సీఐడీ కార్యాలయానికి పిలిపించారు. నరేంద్రకు వైద్య పరీక్షలు చేయించారు. గుంటూరులోని సిఐడీ కోర్టులో నరేంద్రను ప్రవేశపెట్టనున్నారు.
ఇవీ చదవండి: