దేశం మొత్తం మీద కాంగ్రెసేతర పక్షాలతో నిర్వహించిన అతి పెద్ద సభగా 1983 మే 26,27,28 తేదీల్లో జరిగిన విజయవాడ మహానాడు నిలిచింది. మూడు రోజుల పాటు నగరంలోని మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుక దేశరాజకీయాల్లో చారిత్రక ఘట్టానికి తెరలేపింది. ఈ వేడుక సమయంలో.. సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ కుటీరం ప్రత్యేక ఆకర్షణ. రెల్లు గడ్డితో కుటీరాలు ఏర్పాటు చేసి అందులో ఎన్టీఆర్ బస చేసేవారు.
విజయవాడ మహానాడుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యేతర పార్టీల ముఖ్యనేతలంతా హాజరయ్యారు. తమిళనాడుకు చెందిన రెండు ప్రధాన పార్టీల అధినేతలు ఎంజీ రామచంద్రన్, కరుణానిధిలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి కాంగ్రెస్ యేతర పక్షాలను ఏకం చేసిన ఘనత ఆనాటి బెజవాడ మహానాడుది. మాజీ ప్రధానులు చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి, రామకృష్ణ హెగ్డే, ఎస్.ఆర్.బొమ్మె, చంద్ర రాజేశ్వరరావు, నందూద్రి పాద్, జ్యోతి బసు, భీం సింగ్, బిజూ పట్నాయక్ వంటి నాయకుల ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్ వద్ద పెద్ద బహిరంగ సభ నిర్వహించారు.
దేశ స్థాయిలో కాంగ్రెస్ యేతర పక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చిన భారీ బహిరంగ సభ ఇదే. దేశ రాజకీయాల్లో తెలుగువారు కీలకపాత్ర పోషించగలరన్న సందేశాన్ని ఎన్టీఆర్ ఈ వేదిక ద్వారా చాటారు. ప్రజా సంక్షేమం, భవిష్యత్తు రాజకీయాల వ్యూహంపై వివరణాత్మక చర్చలకు విజయవాడ మహానాడు వేదికైంది. సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఎన్టీఆర్ బస, పటమట-ఆటోనగర్‌లో జాతీయ నాయకులతో భారీ బహిరంగ సభ, సిద్ధార్థ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న శాతవాహన నగర్లో కార్యకర్తల సభ ఇలా మూడు రోజులు మూడు ప్రాంతాల్లో మహానాడు జరిగింది.
1983 మహానాడుకు వేదికైనప్పటి నుంచీ శాతవాహన నగర్ రహదారిని మహానాడు రోడ్డుగా పిలుస్తున్నారు. ఇప్పటికీ విజయవాడలోని ఈ రహదారి మహానాడు రోడ్డుగానే అందరికీ సుపరిచితం. ఈ ప్రాంతం ఏర్పాటైన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటి.. దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది.
ఇదీ చదవండి:
కామన్ గ్రేడింగ్‌తో పది విద్యార్థులను పైతరగతికి అనుమతించాలని పిల్