రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ను తెదేపా నేతల బృందం కలిసింది. వైకాపా దాడుల అంశానికి సంబంధించి రెండు ముద్రణ పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలో వంద రోజులుగా వందలాది కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి వెళ్లారని అచ్చెన్నాయుడు అన్నారు. ఇటీవలే బాధితులను ఆదుకునేందుకు శిబిరం ఏర్పాటు చేస్తే అడ్డుకున్నారని మండిపడ్డారు. మేము గొడవలు చేయటానికి చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టలేదని స్పష్టం చేశారు. వారి వారి గ్రామాలకు సురక్షితంగా పంపాలని మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మేం ఒత్తిడి చేయడం వల్లే విధిలేని పరిస్థితుల్లో వారిని గ్రామాల్లో వదిలిపెట్టారని చెప్పారు. ఈ రెండ్రోజుల్లో నాలుగైదు సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. మరోసారి ఈ తరహా ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా దాడులకు సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందజేసినట్లు తెలిపారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు జరిగాయో పుస్తకాల్లో పూర్తిగా పొందుపర్చామని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేతలపై అసభ్యకర పదజాలంతో కూడిన పోస్టులు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేవలం తెదేపా కార్యకర్తలపై కక్ష పూరితమైన చర్యలకు దిగటం సరికాదని వ్యాఖ్యానించారు.