పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు ఎస్పీపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం నడుచుకుంటున్న పోలీసుల్ని వైకాపా నేతలు తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైకాపా నాయకులు ఎస్సీలు, మహిళలు, మైనార్టీలపై దాడులకు దిగుతున్నారని.. దేవాలయాలను ధ్వంసం చేస్తూనే పోలీసుల్నీ బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ.. తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేలా వైకాపా ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
నెల్లూరు ఎస్పీని, కోవూరు ఎమ్మెల్యే హెచ్చరించిన ఘటనపై పోలీసుల మౌనం దేనికి సంకేతమని తెదేపా శాసనసభాపక్ష విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి నిలదీశారు. అధికార పార్టీ నాయకులు మిమ్మల్ని కించపరుస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని పోలీసు అధికారుల్ని ఆయన ప్రశ్నించారు. చట్టం కొందరికే చుట్టమా అనేదానిపై పోలీసు సంఘం నాయకులే స్పష్టం చేయాలన్న వీరాంనేయ స్వామి.. అందరి ముందే ఎస్పీని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరిస్తే పోలీస్ సంఘాలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని నిలదీశారు.
ఇదీ చదవండి: 'ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, దాడులు చేస్తారా?'