లాక్డౌన్లో భాగంగా రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతులు దళారుల చేతిలో మోసపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. సంబంధిత మంత్రులు స్పందించాలన్నారు.
ప్రభుత్వం భేషజాలకు పోకుండా కరోనా కట్టడికి పారదర్శకంగా వ్యవహరించాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చే సూచనలపై మంత్రులు రాజకీయ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. కరోనా కేసులు పదే ఉండటం సంతోషమని సీఎం అంటే... ఇప్పుడు అదే సంఖ్య 87కి చేరిందని గుర్తు చేశారు. కరోనా నిర్దరణ పరీక్ష కేంద్రాలు పెంచాలని డిమాండ్ చేశారు.

కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రజలంతా తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమని బతుకుతుంటే... వైకాపా నాయకులు మాత్రం ఈ సమయంలో అక్రమార్జనకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
కరోనాతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతుంటే... ఇదే అదనుగా నిత్యావసర వస్తువుల ధరలను వ్యాపారులు ఇష్టానుసారంగా పెంచుతున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత విమర్శించారు. వీరిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ధరలు నియంత్రణకు సర్కారు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 50 శాతం మాత్రమే ఇవ్వాలన్న నిర్ణయం సరైంది కాదని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని జీతాల్లో కోత విధిస్తూ... కొత్తవారిని సలహాదారులుగా నియమించటం ఏ మేరకు సహేతుకమని ప్రశ్నించారు. మంత్రులు వారి శాఖలపై దృష్టి పెట్టి పని చేయాలే తప్ప... బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని హితవు పలికారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకారం అందించాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: