చలో ఆత్మకూరు కార్యక్రమం విజయవంతమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. ప్రభుత్వ అణచివేత కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వైకాపా బాధితులకు న్యాయం కోసమే చలో ఆత్మకూరు చేపట్టామన్న కళా వెంకట్రావు... వారికి అండగా నిలిచేందుకు తెదేపా శ్రేణులు తరలివచ్చాయన్నారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ధ్వజమెత్తారు.
చట్టాన్ని, పోలీసు వ్యవస్థను వైకాపా నేతలు చెప్పుచేతుల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీసు వ్యవస్థకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెదేపా చేపట్టిన కార్యక్రమంలో 5,224 మంది పాల్గొన్నారన్న కళా...70 మంది నేతలను గృహ నిర్బంధం చేశారని వివరించారు. 1,144 మంది తెదేపా కార్యకర్తలను అరెస్టు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా వైకాపా బాధితులకు భరోసా కల్పించామని పేర్కొన్నారు.
ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చలో ఆత్మకూరు కార్యక్రమం తెదేపా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపిందన్నారు. ఈనెల 18న చంద్రబాబు బాధితుల గ్రామాలకు వెళ్లి కలుస్తారని వెల్లడించారు. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తారని తెలిపారు. గురువారం డీజీపీని కలిసి దాడులకు సంబంధించి సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. బాధితులకు అండగా 13 జిల్లాలకు 13 బృందాలను పంపుతామని ప్రకటించారు.
శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి: చినరాజప్ప
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని తెదేపా సీనియర్ నేత చినరాజప్ప అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారం కంటే రెచ్చగొట్టేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ధ్వజమెత్తారు. 144 సెక్షన్ పేరుతో పోలీసులు నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీకి చంద్రబాబు సమగ్ర వివరాలతో లేఖ రాస్తారని చెప్పారు. ఎక్కడెక్కడ దాడులు జరిగాయో చూసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు.
18న చంద్రబాబు... చలో ఆత్మకూరు: నిమ్మల
ఈ నెల 18న చంద్రబాబు... చలో ఆత్మకూరు నిర్వహిస్తారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం సమస్యను మరింత జఠిలం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్టి ఉద్యమం తెదేపా నైతిక విజయమని చెప్పుకొచ్చారు. బాధితులపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి