TDP leaders demand MP Gorantla resignation: నగ్న వీడియోలతో మహిళను వేధించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గుంటూరులో జిల్లా తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. విచారణ పేరుతో వైకాపా పెద్దలు కాలయాపన చేయడం.. వారి ఆలోచనకు అద్దం పడుతోందని విమర్శించారు. పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన ఎంపీ మాధవ్‌ను పదవి నుంచి తొలగించాలని.. ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళల మనుగడకే ప్రమాదం తలెత్తేలా వైకాపా పాలన ఉందని.. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖలో ఆవేదన వెలిబుచ్చారు. సస్పెన్షన్లతో చేతులు దులుపుకోకుండా.. ఎంపీ మాధవ్‌ను ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా మహిళలంతా వైకాపా ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు..
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం.. రాష్ట్ర ప్రజలను సిగ్గుతో తలదించుకునేలా చేసిందని.. శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎమ్.ఏ. షరీఫ్ భీమవరంలో అన్నారు. తప్పు చేసి దొరికిపోయింది కాక.. తెలుగుదేశం నాయకులు, మీడియాపై దుర్భాషలాడటం.. మాధవ్ నైజానికి నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌కు, వైకాపాకు ఏ మాత్రం నైతికత ఉన్నా.. ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
వైకాపా నేతలు.. మహిళల మానప్రాణాలతో చెలగాటమాడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ వారిపై చర్యలు తీసుకోవడం మానేసి.. పదవులు కట్టబెడుతున్నారని.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. దిక్కు లేని దిశా చట్టంతో.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. దేశంలో ఓ వైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు, జెండా పండుగలు జరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం ఎంపీ మాధవ్ నగ్న ప్రదర్శనలు చూడాల్సి వస్తోందని.. తెలుగుదేశం నేత.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి నేరగాళ్లకు రివార్డులు ఇవ్వడం.. సీఎం జగన్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని లోక్‌సభ స్పీకర్ సుమోటాiా స్వీకరించి విచారణ జరిపించాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ కోరారు. అది నిజమని తేలితే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అసభ్య పదాలు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామన్న స్పీకర్.. అసభ్య ప్రవర్తనతో పార్లమెంట్ ప్రతిష్ట మసకబారేలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎంపీ మాధవ్ వికృత చేష్టలపై సీఎం జగన్ స్పందించకపోవడం.. దారుణమని.. హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్థసారధి విమర్శించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో డిమాండ్ చేశారు. కదిరిలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. జాతీయరహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఇవీ చదవండి: