మడ అడవులు లేకపోవటం వల్ల కలిగే నష్టాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. మడ అడవులను నరికేసి వైకాపా ప్రభుత్వం మట్టి నింపేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఈమేరకు మడ అడవుల నరికివేత ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. చట్టాలను అతిక్రమించి నేరాలు చేసే వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టాలు, అటవీ పరిరక్షణ చట్టాలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, ఇలా ఎన్ని చట్టాలు ఉన్నా నిరుపయోగమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కాకినాడ మడ అడవులను నరికేసి, పూడ్చి పాతరేస్తున్నట్టే నిబంధనలన్నిటినీ పాతరేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
పేదలకు స్థలాలు ఇవ్వాలంటే కాకినాడలో జగన్ బినామీ వద్ద వేల ఎకరాలున్నాయని పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అవన్నీ వదిలేసి దుమ్ములపేటలో వంద ఎకరాలకు పైగా మడ అడవుల్ని ప్రొక్లయినర్లతో పెకిలించి మరీ విధ్వంసం సృష్టించటమేంటని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం చాలా మంచి నిర్ణయమే కానీ.. దానిని రాష్ట్రవ్యాప్తంగా బినామీల పేరుతో ఉన్న స్థలాల్లో అమలు చేయాలని మాజీమంత్రి జవహర్ హితవు పలికారు. జీవవైవిధ్యానికి కేంద్రంగా ఉన్న మడ అడవులను నరికివేయడం...ప్రకృతి విధ్వంసం కాదా అని నేతలు ప్రశ్నించారు.
ఇదీ చదవండి :