ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అని చెప్పే సీఎం జగన్మోహన్ రెడ్డి.. అనకాపల్లిలో రైతులకు ఉపయోగపడే హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కడపకు ఎందుకు తరలిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. క్షేత్రం తరలించడం అంటే రైతులకు అన్యాయం చేసినట్లేనని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలకు కలిపి రైతులకు ఉపయోగపడే విధంగా అనకాపల్లిలో 107 సంవత్సరాల క్రితం వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని స్థాపించారని గుర్తు చేశారు. వైద్య కళాశాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. వ్యవసాయదారులకు ఏర్పాటు చేసిన మంచి పరిశోధన క్షేత్రంలో 30 ఎకరాలు కేటాయించడం అంటే రైతులకు అన్యాయం చేసినట్లేనని అయ్యన్న తెలిపారు. వేరొక స్థలంలో వ్యవసాయ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'ఉగ్రమూకలపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి'