
భూములు ఇచ్చిన రైతులు లాఠీ దెబ్బలు తిన్న ఘటన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. రాజధాని అమరావతి రైతుల పట్ల పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోను చంద్రబాబు.. తన సందేశానికి జత చేశారు.

రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బడుగుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మూసేవేసి,పేదవాడి కడుపు కొట్టారని ఆక్షేపించారు.

"మాట తప్పుడు, మడమ తిప్పుడు వంశానికి సీఎం జగన్ వారసుడు" అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వెయ్యడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని కల్లోలం సృష్టించారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ చెప్తున్న ఆరోగ్యశ్రీ మాటలకే పరిమితమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మైలవరంలో నడిరోడ్డుపై మహిళ ప్రసవవేదన పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ జగన్ నిర్లక్ష్య వైఖరికి బలయ్యిందని ఆరోపించారు. 12 నెలల్లో వైద్యరంగంలో ఎంత ఖర్చుపెట్టారో, ఎన్నిఉద్యోగాలు ఇచ్చారో.. ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని ఉమా సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: