తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో జగన్ సాంకేతికంగా గెలిచినా.. నైతికంగా ఓడిపోయారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై తిరుపతిలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సంఘాన్ని నిర్వహిస్తున్న తీరులో సమూల ప్రక్షాళన అవసరం అన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కమిషనర్లుగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు బదులు, బ్యాలెట్ పేపరు ద్వారా ఎన్నికలు జరగాలని కోరిన ఆయన.. ఆట బొమ్మలుగా ఈవీఎంలు మిగులుతున్నాయన్నారు.
తిరుపతి ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు పడ్డాయని, రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన ఆయన.. అస్సాం, తిరుపతి ఎన్నికలలో ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీకి అనుమానాలున్నాయన్నారు. తిరుపతిలో పోలింగ్ సమయం రాత్రి 7 గంటలకు ముగిస్తే.. స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు చేరుకునే సరికి 16 గంటలు ఆలస్యం అయిందని చెప్పారు. స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న చింతా మోహన్.. జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే కానీ.. ఎక్కువ కాలం పదవిలో ఉండలేరన్నారు. చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల నుంచి ఎవరో ఒకరు కొత్త ముఖ్యమంత్రి అవుతారన్నారు.
ఇదీ చదవండి: