స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ పై విచారణ ముగించిన జస్టిస్ నారిమన్ ధర్మాసనం... అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. తదుపరి చర్యలు నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. రమేశ్ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‌ను కస్టడీలోకి తీసుకోకుండానే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్ పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ చేయాలని... వారు లేవనెత్తిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే స్టే ఎలా ఇస్తారని వాదించారు. ప్రతివాది రమేశ్ ఆస్పత్రి ఛైర్మన్ తరఫున శ్యామ్ దివన్ వాదనలు వినిపిస్తూ... దర్యాప్తు ఆపాలని తమ ఉద్దేశ్యం కాదని, బలవంతపు చర్యలు వద్దని హైకోర్టుకు వెళ్లామని చెప్పారు. హైకోర్టు కూడా సాధారణ దర్యాప్తుపై స్టే ఇవ్వలేదని తెలిపారు.
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
స్వర్ణ ప్యాలెస్ ఘటన: సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం