Protest Against Electricity Charges Hike: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం నాయకులు భగ్గుమన్నారు. చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఛార్జీలు పెంచిన ఘనత జగన్‌దేనంటూ మండిపడ్డారు. స్విచ్ వేయకుండానే ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. కృష్ణా జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. సీపీఎం నాయకులు విద్యుత్ తీగల్ని మెడకు చుట్టుకుని విజయవాడ అజిత్‌సింగ్ నగర్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో సిటీ బస్సులు ఆపి తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భిక్షాటన చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరు తప్పదని తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత హెచ్చరించారు.
JSP Protest current Charges in AP: గుంటూరు కొత్తపేట విద్యుత్ భవన్ ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నా చేశారు. తాడేపల్లి, మంగళగిరిలో వామపక్ష నేతలు నిరసన తెలిపారు. నులకపేట సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఛార్జీల వాతపై శుక్రవారం గుంటూరులో ర్యాలీ చేస్తామని జనసేన నాయకులు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంపుతో కోలుకోలేని దెబ్బకొట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళనలతో హోరెత్తించాయి. కర్నూలు, ఆదోని విద్యుత్ భవన్‌ల ఎదుట నాయకులు బైఠాయించారు. తెలుగుదేశం నేత గౌరు చరితారెడ్డి ఆధ్వర్యాన ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మిగనూరు, నంద్యాలలో ఛార్జీల పెంపు ప్రతులను వామపక్ష నేతలు తగులబెట్టారు.
CPI Protest Over Power Charges Hike: విద్యుత్ ఛార్జీల మోతను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో విపక్షాలు కదం తొక్కాయి. అనంతపురం ఎస్ఈ కార్యాలయం ఎదుట విసనకర్రలు, లాంతర్లు పట్టుకుని చంద్ర దండు నాయకులు నిరసన తెలిపారు. విద్యుత్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు వామపక్ష నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. కడప విద్యుత్ భవన్ ఎదుట రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా చేశారు.
BJP Protest: కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నెల్లూరు జిల్లాలో వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద నాయకులు నిరసనకు దిగారు. ఛార్జీల మోతతో ఫ్యాన్‌కు ఉరి వేసుకునే పరిస్థితి వచ్చిందంటూ.. తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట వామపక్ష నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. తిలక్ రోడ్డులో ఫ్యాన్‌కు, గ్యాస్ బండకు పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం అంధకారం అయిందని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
TDP on Power Issue in AP: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సహా పలు ప్రాంతాల్లో.. తెలుగుదేశం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఛార్జీల వాతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలూరులోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తణుకు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఛార్జీల పెంపు ప్రతులను దహనం చేశారు.
Left Parties on Power Charges Hike: ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద దీపపు బుడ్డీలతో వామపక్ష నాయకలు ఆందోళన చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మార్కాపురంలో ర్యాలీ చేసిన నాయకులు... కోర్టు కూడలిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగులబెట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాలు ఆందోళన చేశాయి. శ్రీకాకుళంలో వామపక్షాల రాస్తారోకో వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.