అమరావతి ప్రాంత రైతుల చేతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు సంకెళ్లు వేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రైతుల మనోభావాలను కాపాడాలంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. అమరావతి రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతపురం జిల్లరాయదుర్గంలోనూ ఆందోళనలు కొనసాగాయి. చిలకలూరిపేటలో ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కడప జిల్లా పులివెందుల తహసీల్దార్ కార్యాలయంలో బీటెక్ రవి వినతి పత్రం అందించారు.
జగన్ సామాజికవర్గమైతే రైతులకు బేడీలు వేసేవారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నిలదీశారు. అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుపడుతూ డీజీపీకి ఆయన లేఖ రాశారు. ఎవరి ఆదేశాల మేరకు రైతులకు బేడీలు వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'ఎవరి ఆదేశాలతో రైతులకు బేడీలు వేశారు?'