ఆరోగ్య బీమాతో పాటు కొవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందిస్తున్న తమకు ప్రత్యేక ఇన్‌సెంటివ్స్ ఇవ్వాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం మరోసారి ప్రభుత్వంతో జరగనున్న చర్చల పురోగతిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూడాల ప్రతినిధులు తెలిపారు.
విజయవాడలో..
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. అత్యవసర కేసులు, కరోనా కేసుల వరకు హాజరై.. మిగతా సేవలు నిర్వహించకూడదని నిర్ణయించారు. ఓపీని పూర్తిగా బహిష్కరించిన జూడాలు.. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
రుయాలో..
తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం నుంచి దశలవారీగా సమ్మెకు పిలుపునిచ్చారు. అత్యవసర విభాగంలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో లానే కోవిడ్ ఇన్సెంటివ్స్, రోగుల నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలివ్వాలని.. ఉపకార వేతనంలో కోతలు విధించకూడదని కోరుతూ నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా కొవిడ్ విధులు, నాన్ కొవిడ్ అత్యవసర సేవలు మినహా.. సాధారణ ఓపీ విధులను బహిష్కరించినట్లు తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే కొవిడ్ అత్యవసర సేవలు సైతం బహిష్కరించి ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నెల్లూరులో..
సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే 12వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!