రాష్ట్రంలో అమలు చేస్తున్న ఒన్ స్టాప్ కేంద్రాలు, ఉజ్వల, స్వధార్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానికి రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రి దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి వనిత... రాష్ట్రంలో అమలు చేస్తున్న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల గురించి వివరించారు. ఈ రెండు పథకాలకు 1863 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అంగన్ వాడీ కేంద్రాలను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వనిత వివరించారు. మినీ అంగన్ వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్ వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే అంగన్ వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న 7లక్షల రూపాయలను 12 లక్షల రూపాయలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి