రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కొవిడ్ ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూకు ఆమోదంపై చర్చ జరగనుంది. కరోనా ఉద్ధృతి, ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్ సరఫరాపై చర్చించనున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష జరగనుంది. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపుపై చర్చించే అవకాశం ఉంది.
మంత్రివర్గ సమావేశంలో రామాయపట్నం పోర్టు బిడ్ల ఖరారుపై ర్యాటిఫికేషన్ ఆమోదించే అవకాశం ఉంది. రుషికొండ బీచ్ రిసార్టు లీజు రద్దుపై చర్చించే ఛాన్స్ ఉంది. మరో ప్రైవేటు సంస్థకు లీజు అప్పగించేందుకు ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. భూసేకరణలో అదనపు పరిహారంపైనా సమాలోచనలు చేసే అవకాశం ఉంది.
ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం అదనపు పరిహారం ఇచ్చేందుకు ఈ సమావేశంలో ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. అర్చకులకు వేతనాల పెంపుపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో ఇచ్చే యోచనపై చర్చ జరగనుంది. వర్సిటీల్లో స్థానిక నాన్ లోకల్ సీట్ల కేటాయింపులపై కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉంది. స్థానిక నియోజకవర్గ విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్‌పై యోచిస్తున్నారు.
ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. అధ్యాపకులను కూడా ప్రభుత్వ సర్వీసులోనికి తీసుకునే అవకాశం ఉంది. చెన్నై- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రణాళికపై చర్చ జరగనుంది. రూ.5 వేల కోట్ల అభివృద్ధి ప్రణాళికలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
టూరిజం ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర అతిథిగృహాల నిర్మాణంపై చర్చ జరగనుంది. పర్యాటకశాఖ ప్రతిపాదించిన మొత్తం 8 ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అతిథిగృహం నిర్మాణం కూడా పర్యాటక ప్రాజెక్టు కింద చేపట్టాలనే అంశంపైనా సమాలోచనలు జరిపే అవకాశం ఉంది.
ఇదీ చదవండీ... సీఐడీ విచారణకు హాజరైన మాజీమంత్రి దేవినేని ఉమ