సినిమా, టెలివిజన్, అంతర్జాలం ఎంత విస్తరించినా.. నాటక ప్రదర్శనలనే నమ్ముకొని జీవిస్తున్న ఏకైక కుటుంబం సురభి. కొత్త కొత్త నాటకాలను ఊపిరిపోసి ఏళ్ల తరబడి నాటక ప్రియులను ఆకట్టుకుంటూ పిల్లాపాపలను పోషించుకునేది. తెర వెనుక ఎన్ని కష్టాలున్నా... రంగస్థలంపై నవ్వుతూ నవ్విస్తూ సురభి కళాకారులు నాటకాన్ని రక్తి కట్టించేవారు. అలాంటి కళాకారులపై గోరుచుట్టపై రోకలిపోటు మాదిరిగా మారిన కరోనా మహమ్మారి... వారి జీవితాలను కకావికలం చేసింది. నాటక ప్రదర్శలు కరవై.. చేతుల్లో చిల్లి గవ్వలేక అల్లాడుతున్న వారిని మరింత కుంగదీసింది. ఇప్పటికే సురభి సమాజంలోని కళాకారుల్లో కరోనా బారినపడి 60ఏళ్లకుపైబడిన వారిలో 20 మందికిపైగా చనిపోగా... మరికొంత మంది దిగులుతో మంచం పట్టారు.
ప్రదర్శనలు నిలిచిపోయి..
పేదరికం, ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్న కళాకారుల కుటుంబాలు.. కరోనా కాటుకు పెద్దదిక్కును కోల్పోవాల్సి వచ్చింది. నాటక ప్రదర్శనలు నిలిచిపోవడంతో.. ఇతర పనులతో ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్న కళాకారులకు.. ఇంటిపెద్దల మరణాలు కన్నీటిని మిగిల్చాయి. దాతలు ఇచ్చే నిత్యావసర వస్తువులతోనే అనేకమంది రోజులు వెళ్లదీసే పరిస్థితి ఏర్పడింది. కళామతల్లికి ఎంతో సేవ చేసిన సురభి.. సమాజానికి తమ గౌరవాన్ని తాకట్టు పెట్టినా.. అయినవారిని కాపాడుకోలేకపోయారు. అప్పు కూడా పుట్టక తమవారిని కోల్పోయారు. ఎన్నో వందల ప్రదర్శనలిచ్చి.. ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టిన వారికీ. కరోనా కాటు కష్టం తప్పలేదని వారు వాపోతున్నారు.
పూట గడవని పరిస్థితి..
లింగంపల్లి సురభి కాలనీలో ఉన్న కుటుంబాలను కదిలిస్తే ఒక్కో కుటుంబానిది ఒక్కో గాథ. కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఈ కాలనీలో నివసిస్తున్న వారు సురభి సమాజంలో బతకలేక.. బతుకుదెరువు కోసం బయటి నాటకాల్లో ప్రదర్శలిచ్చినా... పూట గడవని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"కరోనా కారణంగా బయట కూడా ఎలాంటి నాటక ప్రదర్శనలు లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పిల్లలను పస్తులుంచలేక ఒంటి మీది నగలు, నాటకానికి సంబంధించిన వస్తువులను అమ్ముకొని కడుపు నింపుకుంటున్నాం" -సురభి జ్యోతి, సీనియర్ కళాకారిణి
ఇదీ చదవండి :
Gang Rape: కాబోయే భర్తను తాళ్లతో కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!