కరోనా నుంచి 171 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రజా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రతి మిలియన్ ప్రజలకు 1,147 మందికి పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా పాజిటివ్ రేటు మన రాష్ట్రంలో 1.66గా ఉందన్నారు. పలు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్ రేటు చాలా తక్కువన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి 3 కరోనా కేసులు వచ్చాయన్న జవహర్‌రెడ్డి... శ్రీకాకుళం జిల్లాలో కేసులన్నీ పాతపట్నం మండలానికి చెందినవని తెలిపారు. కొత్తగా వచ్చిన 10 కేసులు 7 క్లస్టర్ల నుంచి వచ్చాయని వివరించారు. వాటితో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 196 క్లస్టర్స్ ఉన్నాయన్నారు. పల్స్ రేటు తగ్గిన వారిపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరామని తెలిపారు.
పలువురు వైద్యులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని జవహర్‌రెడ్డి వివరించారు. ఇప్పటివరకు 22,600 మంది పేర్లు నమోదు చేసుకున్నారని.. పలు ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చారని వెల్లడించారు. దానివల్ల అక్కడున్న డయాలసిస్ రోగులకు ఇబ్బంది ఏర్పడిందని..డయాలసిస్ రోగులను పక్క ఆస్పత్రులకు తరలిస్తున్నామని అన్నారు. కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జవహర్‌రెడ్డి సూచించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం ఉంటే 104కు ఫోన్ చేయాలని తెలిపారు.
ఇవీ చదవండి: ఈ వస్త్రాలతో చేసిన మాస్కులతోనే వైరస్‌కు బ్రేక్!