దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 8 నుంచి 18 వరకు నాలుగు వేల ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని, వీటిలో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి 1,383, బెంగళూరు నుంచి 277, చెన్నై నుంచి 97, రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య 2,243 సర్వీసులు నడుపుతామన్నారు. ఇవి ఒకవైపు ఖాళీగా వెళ్తాయని, అందుకే వీటిలో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టేలా అనధికారికంగా తిరిగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, జీపులు, ఆటోలపై ఈ నెల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామని తెలిపారు.
టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదు
‘ఆర్టీసీలో 3 వేలకుపైగా ఉన్న పల్లెవెలుగు బస్సులను డిజైన్ సహా అంతా మార్పుచేసి కొత్తగా తయారు చేస్తున్నాం. లగ్జరీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామన్న అపవాదు తొలగించుకొని పల్లెవెలుగు బస్సులను విడతల వారీగా మార్పులు, చేర్పులు చేస్తున్నాం. సంస్థపై డీజిల్ భారం 50-60 శాతం పెరిగినా.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచలేదు. ప్రస్తుతం టికెట్ ధరలు పెంచే ఆలోచన ఏమీలేదు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 63-65 శాతం ఉండగా, అది 75 శాతానికి చేరితే నష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలుంటుంది. అద్దె ప్రాతిపదికన వంద విద్యుత్ బస్సులు తీసుకోనున్నాం. వీటికి సంబంధించి రాయితీ కోసం కేంద్ర అనుమతి రావాల్సి ఉంది.
డీజిల్ ధరల పెరుగుదల చూస్తుంటే మున్ముందు విద్యుత్ బస్సులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్ ఛార్జీల్లో సీనియర్ సిటిజన్‌లకు రాయితీ త్వరలో పునరుద్ధరిస్తాం. ప్రజా రవాణా శాఖలో విలీనం అయ్యాక మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య నియామకాలు చేపట్టేలా ఆదేశాలు వచ్చాయి. త్వరలో వీటిని భర్తీ చేస్తాం. విలీనానికి ముందు మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య నియామకాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆదేశాలు రావాల్సి ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నెలలోపు ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీల బకాయిలను వడ్డీతో చెల్లిస్తాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ.. పోలీసులు, ఉపాధ్యాయులపైకి రాళ్లు